Israel-Iran Tensions: ఇజ్రాయెల్ (Israel) పై దాడి చేయవద్దని ఇరాన్ (Iran) ను హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
మధ్య ప్రాచ్యం (మిడిల్ ఈస్ట్) లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్ పై దాడి చేయవద్దని అమెరికా అధ్యక్షుడు (US President) జో బైడెన్ (Joe Biden)ఇరాన్ ను హెచ్చరించారు. రెండు వారాల క్రితం సిరియాలోని కాన్సూలేట్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసిన నేపథ్యంలో...ఇజ్రాయెల్ పై దాడి చేసేందుకు ఇరాన్ 100 కుపైగా క్రూయిజ్ క్షిపణులను, డ్రోన్ క్షిపణులను మోహరించింది. ఇరాన్ ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశముందని భావిస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేయాలనుకుంటే తాము ఇజ్రాయెల్ దేశానికే మద్దతిస్తామని బైడెన్ వ్యాఖ్యానించారు. కచ్చితంగా ఈ పోరులో అమెరికా ఇజ్రాయెల్ కు అన్నివిధాల సహాయం చేస్తామని బైడెన్ వెల్లడించారు.
ఇజ్రాయెల్ను కాపాడుకునేందుకు అమెరికా ఎప్పుడూ సిద్ధమే: బైడెన్
ఇజ్రాయెల్ పై దాడిలో ఇరాన్ ఎప్పటికీ విజయవంతం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఇజ్రాయెల్ వైపు ఇరాన్ వందకు పైగా క్రూయిజ్ క్షిపణులను, డ్రోన్ క్షిపణులను, మిలిటరీ బలగాలను మోహరించిందని ఏబీసీ, సీబీఎస్ వార్తా సంస్థలు కథనాలు ఇచ్చాయి. ఇజ్రాయెల్ కాపాడుకునేందుకు అమెరికా ఎప్పుడూ సిద్ధంగా నే ఉంటుందని బైడెన్ తెలిపారు. ఇరాన్ దాడి చేసే అవకాశాలున్న నేపథ్యంలో ఇప్పటికే అమెరికా సెంట్రల్ కమాండ్ చీఫ్ మైఖేల్ ఎరిక్ కురిల్లా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లాంట్, ఇజ్రాయెల్ రక్షణ విభాగం చీఫ్ లెఫ్టనెంట్ జనరల్ హెర్జీ హలేవీతో శుక్రవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇరాన్ దాడి చేసే అవకాశాలను, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టే వ్యూహాలను గురించి చర్చించినట్లు సమాచారం.