Kamala Harris:అమెరికాలో కాల్పుల కలకలం.. కమలా హారిస్ ప్రచార కార్యాలయం ధ్వంసం
అమెరికాలో నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల కోసం పోటీ తీవ్రంగా ఉన్నది.ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖ్య అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల సమయంలో అభ్యర్థులపై దాడులు పెద్ద కలకలం సృష్టిస్తున్నాయి. తాజా ఉదంతంలో,కమలా హారిస్ పార్టీ సమన్వయ ప్రచార కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి తుపాకీ కాల్పులు జరిపారు. పోలీసుల సమాచార ప్రకారం,అరిజోనాలో ఉన్న డెమోక్రటిక్ పార్టీ ప్రచార కార్యాలయం మీద అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. సిబ్బంది ఈ విషయం పోలీసులకు తెలియజేయడంతో వారు ఘటనాస్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. కార్యాలయం కిటికీల వద్ద కాల్పులు జరిగాయని వారు వెల్లడించారు.అదృష్టవశాత్తు,ఆ సమయంలో కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
డొనాల్డ్ ట్రంప్‌పై కూడా ఇలాంటి దాడులు
ఇటీవల, డొనాల్డ్ ట్రంప్‌పై కూడా ఇలాంటి దాడులు జరిగాయి. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా, నిందితుడు హత్యాయత్నం చేశాడు. భద్రతా బలగాలు ఫెన్సింగ్ వద్ద నుంచి అతన్ని తుపాకీతో వస్తుండగా గమనించి కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. అలాగే, రెండు నెలల క్రితం పెన్సిల్వేనియాలో ట్రంప్ ఎన్నికల సభలో ప్రసంగిస్తుండగా కాల్పులు జరగడంతో, ట్రంప్ కుడి చెవి భాగానికి తూటా తగిలిన విషయం తెలిసిందే. తాజా సంఘటనలో కమలా హారిస్ ప్రచార కార్యాలయంపై జరిగిన కాల్పులు మరింత సంచలనం రేపాయి.
ఎన్నికల బరిలో కమలాహారిస్ ముందంజ
ఎన్నికల పోటీలో కమలా హారిస్ ముందు కొనసాగుతున్నారు. తాజా సర్వేల ప్రకారం, ఆమె ఆసియన్ అమెరికన్ ఓటర్లలో 38 పాయింట్ల ఆధిక్యంతో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై ఆధిక్యంలో ఉన్నారు. చికాగో విశ్వవిద్యాలయంలో ఎన్‌ఓఆర్‌సీ నిర్వహించిన సర్వేలో 66 శాతం ఆసియా అమెరికన్ ఓటర్లు హారిస్‌కు మద్దతు చూపించగా, కేవలం 28 శాతం మాత్రమే ట్రంప్‌కు మద్దతు ఉన్నారు. ఇదే సర్వేలో, బైడెన్ అభ్యర్థిగా ఉన్నప్పుడు 46 శాతం మద్దతు ఉండగా, 31 శాతం మంది ట్రంప్‌కు అనుకూలంగా ఉన్నారు.