Kamala Harris: గవర్నర్ రేసులో కమలా హారిస్.. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తర్వాత కొత్త వ్యూహం?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఓటమిపాలైన విషయం తెలిసిందే.
అయితే, తాజాగా ఆమె కాలిఫోర్నియా గవర్నర్ పదవికి పోటీ చేయాలని యోచిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
ఈ మేరకు పలు వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఇటీవల జరిగిన పలు కార్యక్రమాల్లో కమలా హారిస్ తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికలపై సంకేతాలిచ్చారు.
కాలిఫోర్నియా గవర్నర్‌గా పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు సూచనప్రాయంగా తెలిపారు. మరికొన్ని రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఆమె వెల్లడించారు.
ప్రస్తుతం గావిన్ న్యూసమ్ కాలిఫోర్నియా గవర్నర్‌గా కొనసాగుతున్నారు. ఇక 2028 అధ్యక్ష ఎన్నికల్లో ఆమె పోటీ నుంచి వెనుకడుగు వేసే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Details
డెమోక్రటిక్ పార్టీకి అనుకూలంగా కాలిఫోర్నియా ప్రజలు
దశాబ్దాలుగా కాలిఫోర్నియా రాష్ట్ర ప్రజలు డెమోక్రటిక్ పార్టీకి అనుకూలంగా ఓటు వేస్తూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో కమలా హారిస్ గవర్నర్ రేసులో నిలబడితే, విజయం సాధించే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై కమలా హారిస్ పోటీ చేసి ఓటమి చెందారు.
ఈ ఎన్నికల్లో ట్రంప్ కీలకమైన స్వింగ్ రాష్ట్రాలను తనవైపుకు తిప్పుకుని, మొత్తం 312 ఎలక్టోరల్ ఓట్లతో విజయం సాధించారు. కమలా హారిస్ 226 ఎలక్టోరల్ ఓట్లను మాత్రమే పొందగలిగారు.
ఎన్నికల్లో ఓటమి అనంతరం హారిస్ మాట్లాడుతూ, కొన్ని విజయాలు సమయాన్ని తీసుకుంటాయని, అయితే పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు.