Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ట్రూత్ సోషల్ సీఈఓకి కీలక బాధ్యతలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ కార్యవర్గాన్ని మరింత సమర్థవంతంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో తన సన్నిహితులు, బంధువుల కోసం కీలకమైన స్థానాలను కేటాయించారు. తాజాగా ట్రూత్ సోషల్ సీఈఓ డెవిన్ నూనెస్‌ను ప్రెసిడెంట్ ఇంటెలిజెన్స్ అడ్వైజరీ బోర్డు ఛైర్మన్‌గా నియమించినట్లు ట్రంప్ సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రకటించారు. ట్రూత్ సోషల్ సీఈఓ డెవిన్ నూనెస్‌ను ప్రెసిడెంట్ ఇంటెలిజెన్స్ అడ్వైజరీ బోర్డు ఛైర్మన్‌గా నియమిస్తున్నానని, ఈ బోర్డులో ఫెడరల్ గవర్నమెంట్‌కు చెందిన ప్రముఖ పౌరులు ఉంటారని చెప్పారు. హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీ ఛైర్మన్‌గా ఆయనకు అనుభవం ఉందన్నారు. రష్యా సంబంధిత బూటకపు సమాచారాన్ని బయట పెట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారని ట్రంప్ కొనియాడారు.
1956లో ప్రెసిడెంట్స్ ఇంటెలిజెన్స్ అడ్వైజరీ బోర్డు స్థాపన
ట్రంప్ తన స్నేహితులు బిల్ వైట్‌ను బెల్జియంలో అమెరికా రాయబారిగా, ట్రాయ్ ఎడ్గర్‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీకి డిప్యూటీ సెక్రటరీగా నియమించారు. డెవిన్ నూనెస్ కాలిఫోర్నియా నుంచి కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహించారు. 2015 నుండి 2019 వరకు హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీ ఛైర్మన్‌గా పనిచేసిన ఆయన, 2019లో ట్రూత్ సోషల్‌కు నాయకత్వం వహించేందుకు కాంగ్రెస్ నుంచి రాజీనామా చేశారు. ప్రెసిడెంట్స్ ఇంటెలిజెన్స్ అడ్వైజరీ బోర్డు 1956లో స్థాపించారు. ఇది అమెరికా అధ్యక్షుడికి దేశంలోని ఇంటెలిజెన్స్ అవసరాలను తీర్చడం, ప్రభుత్వ ఏజెన్సీల సామర్థ్యం పై స్వతంత్ర విశ్లేషణను అందించడం, తదితర కీలక అంశాల్లో సాయపడుతుంది.