Donald Trump: 'అమెరికా పౌరులను చంపితే మరణశిక్షే'.. వలసదారులపై మళ్లీ మండిపడ్డ ట్రంప్
వచ్చే నెల జరిగే అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ మధ్య హోరాహోరీ పోరు ఉండనుంది. ఈ నేపథ్యంలో అక్రమ వలసదారులపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొలరాడోలోని ఆరోరా నగరంలో నిర్వహించిన ఒక ప్రచార సభలో ఆయన మాట్లాడారు. తమ దేశ పౌరులను చంపిన వలసదారులకు మరణశిక్ష విధిస్తానని హెచ్చరీకలు జారీ చేశారు. అమెరికా ప్రమాదకరమైన నేరస్థుల చేతిలో చిక్కుకుందని, ప్రపంచవ్యాప్తంగా అమెరికాను ఆక్రమిత దేశంగా పిలుస్తున్నారని తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే వలసదారులపై నేషనల్ ఆపరేషన్ అరోరాను ప్రారంభిస్తానని స్పష్టం చేశారు.
వలసదారులను దేశం నుండి తరిమేస్తాం
నవంబర్ 5ను అమెరికా విముక్తి దినంగా మార్చుతానని, తమ పౌరులను చంపిన వలసదారులకు మరణశిక్ష విధిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పటికే వెనెజులా గ్యాంగ్‌లు అరోరా అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లను నియంత్రిస్తున్నాయని, వారిని ఏరివేయడమే తన మొదటి కర్తవ్యం అని చెప్పారు. అరోరా సహా దేశంలోని ప్రతి పట్టణాన్ని నేరస్థుల నుండి రక్షిస్తానని, ముఖ్యంగా వలసదారులను దేశం నుంచి తరిమేస్తానని పేర్కొన్నారు. అంతేకాక దక్షిణ సరిహద్దు వద్ద వలసదారుల చొరబాటు విపరీతంగా పెరిగిపోతుందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు.