ఒక రాత్రికి రూ.1కోటి; ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ రిసార్ట్ విశేషాలను తెలుసుకుందామా
లగ్జరీ కట్టడాలకు పేరుగాంచిన దుబాయ్ మరో అత్యద్భుత రిసార్టును అందుబాటులోకి తెచ్చింది. అందులో ఒక రాత్రి గడపాలంటే రూ.లక్షలు కూడా సరిపోవంటే అది ఎంత లగ్జరీగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. భూతల స్వర్గాన్ని తలపించేలా నిర్మించిన రిస్టార్ట్‌పేరు 'అట్లంటాస్ ది రాయల్'. బంగారపు పూతలతో, అద్దాల మెరుపులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఈ రిస్టార్టులో లభించనిదంటూ ఏదీ ఉండదు. ఇంతటి లగ్జరీ రిసార్టులోని రాయల్ మెన్షన్ సూట్ రూమ్ ఉంటుంది. అందులో ఒకరోజు రాత్రి గడపాలంటే ఏకంగా రూ.82లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి మళ్లీ రూ.18లక్షల ట్యాక్స్ అదనం. అంటే ఇందులో ఒకరాత్రికి రూ.కోటిపైనే చెల్లించాలన్న మాట. లగ్జరీ కా బాప్ అయిన ఈరిసార్టును జనవరిలో ప్రారంభించారు. రిసార్టులో 795గదులు ఉంటాయి.
సెలబ్రిటీలే లక్ష్యంగా రిసార్టు నిర్మాణం
'అట్లంటాస్ ది రాయల్' రిసార్టులో అత్యంత తక్కువ ధరకు ఒక రాత్రికి స్టే చేయాలంటే భారత కరెన్సీలో రూ.92వేలు చెల్లించాలి. ఇందులో ఇంతకన్న చౌకైన రూమ్ లేకపోవడం గమనార్హం. ఇక మిడ్ రేంజ్ రూమ్‌లకు అయితే రూ.30లక్షల వరకు వదిలించుకోవాల్సి ఉంటుంది. ఇక రిసార్టు అలంకరణ విషయం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. జెల్లీ ఫిష్ అక్వేరియం, రిచ్ లుక్ కనిపించేలా గదులతో పాటు లాబీల్లో బంగారపు పూతలతో రిసార్టు ఆసాంతం అబ్బుర పరుస్తుంది. సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకొని నిర్మించిన ఈ రిసార్టులో 17బార్లు ఉన్నాయి. బాత్ రూమ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇటాలియన్ మార్బుల్ వంటిని ఈ రిసార్టు కోసం ఉపయోగించారు.