Malaysia Visa-Free Entry: భారతీయులకు గుడ్ న్యూస్.. వీసా లేకుండా మలేషియా వెళ్ళచ్చు
మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం ప్రకారం, డిసెంబర్ 1 నుండి 30 రోజుల వరకు చైనా మరియు భారతదేశ పౌరులకు వీసా రహిత ప్రవేశానికి అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం జరిగిన పీపుల్స్ జస్టిస్ పార్టీ వార్షిక సమావేశంలో మాట్లాడుతూ పెట్టుబడులు, పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దేశం ఆర్థికంగా ముందుకెళ్లాలంటే పర్యాటక రంగ అభివృద్ధి ముఖ్యమన్నఅన్వర్ ఇందులో భాగంగానే చైనా, భారత్ పౌరులకు వీసా లేకుండానే మలేషియాలో పర్యటించేందుకు అనుమతులు ఇస్తామని స్పష్టం చేశారు. డిసెంబర్ 1 నుండి 30 రోజుల పాటు వీసా లేకుండా తమ దేశంలో ఉండొచ్చని ఆయన చెప్పారు.
వీసా సౌలభ్యం కల్పించిన శ్రీలంక, థాయ్, వియత్నాం
ఇదిలా ఉండగా.. ఇటీవల థాయిలాండ్, శ్రీలంక, వియత్నాం ప్రభుత్వాలు కూడా భారతీయులకు వీసా అవసరం లేకుండానే పర్యటించే సౌలభ్యాన్ని కల్పించాయి. నవంబర్ 10 నుంచి వచ్చే మే 10వరకు థాయిలాండ్ ఈ సౌలభ్యం అందుబాటులో ఉందని తెలిపింది. అయితే, డిమాండ్‌ను బట్టి కొనసాగించే అవకాశం ఉంటుందని థాయ్ ప్రభుత్వం వెల్లడించింది. మలేషియా ప్రభుత్వ గణాంకాల ప్రకారం,2019లో చైనా నుండి 1.5 మిలియన్లు, భారతదేశం నుండి 354,486 వచ్చారు. ఈ సంవత్సరం జనవరి- జూన్ మధ్య మలేషియాకు 9.16 మిలియన్ల మంది పర్యాటకులు వచ్చారు. అందులో చైనా నుండి 498,540, భారతదేశం నుండి 283,885 మంది పర్యాటకులు వచ్చారు. మలేషియాలోకి ప్రవేశించడానికి చైనా,భారతీయ పౌరులు తప్పనిసరిగా వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలి.