పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం; 11మంది మృతి; ఉత్తర భారతంలోనూ ప్రకంపనలు
పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంపం దాటికి పాకిస్థాన్‌లో 11మంది మృతి చెందినట్లు ప్రముఖ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది. అఫ్గానిస్థాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు, రిక్టర్ స్కేలుపై 6.6 తీవ్రత నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. భూకంప కేంద్రం అఫ్ఘానిస్థాన్‌లోని జుర్మ్‌లో 180 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైనట్లు వెల్లడించింది. భూకంప కేంద్రం అఫ్గానిస్థాన్‌లో ఉన్నా, దాని ప్రభావం మాత్రం పాకిస్థాన్‌లో అధికంగా చూపించింది. పదకొండు మంది మృతి చెందడమే కాకుండా 100మందికి పైగా గాయపడినట్లు నివేదికలు చెబుతున్నాయి.
భూకంపంపై స్పందించిన దిల్లీ సీఎం కేజ్రీవాల్
అఫ్గానిస్థాన్‌లో సంభవించిన భూకంకం ప్రభావం పాకిస్థాన్‌తో పాటు, ఉత్తర భారతదేశం, కజకిస్తాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్తాన్, చైనా, కిర్గిజ్‌స్థాన్‌లోనూ చూపించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. దిల్లీతో పాటు జమ్ముకశ్మీర్, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్‌లలో కూడా భూమి కంపించింది. భూకంపంపై దిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. దిల్లీ అంతటా బలమైన ప్రకంపనలు సంభవించాయని, అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు. భూకంపం మంగళవారం రాత్రి 10:17 గంటలకు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో 100 మందికి పైగా గాయపడినట్లు పాకిస్థాన్ అత్యవసర సేవల ప్రతినిధి బిలాల్ ఫైజీ చెప్పారు.