
California: కాలిఫోర్నియాలో భారీ కార్చిచ్చు.. 65వేల ఎకరాల్లో చెలరేగిన మంటలు, క్షిణించిన వాయు నాణ్యత
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని సెంట్రల్ కాలిఫోర్నియాలో భారీ స్థాయిలో కార్చిచ్చు వెలసి తీవ్రతరమవుతోంది. గత శుక్రవారం ప్రారంభమైన ఈ అగ్నిప్రమాదం వేగంగా విస్తరిస్తోంది. ఈక్రమంలో గాలి నాణ్యత క్షీణిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 'గిఫోర్డ్ ఫైర్'గా గుర్తించబడిన ఈ మంటలు ఇప్పటి వరకు 65,000 ఎకరాలకు పైగా విస్తరించాయని అధికార వర్గాలు వెల్లడించాయి. అగ్నికీలలు భారీగా ఎగిసిపడటంతో పరిసర ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని లాస్ ఏంజెలెస్,వెంచురా,కార్న్ వంటి దక్షిణ కాలిఫోర్నియాలోని కౌంటీలతో పాటు సమీపంలోని లాస్ వెగాస్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గాలి నాణ్యత మరింతగా క్షీణించే అవకాశముండటంతో ప్రజల భద్రత కోసం అనేక సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు.
వివరాలు
3 శాతం మంటలను అదుపులోకి..
మంటల ప్రభావానికి అత్యంత సమీపంగా ఉన్న ప్రజలను తక్షణమే ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక మంటల నియంత్రణ కోసం ఫైర్ డిపార్ట్‌మెంట్, సహాయ సిబ్బంది కలసి తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ, వాతావరణ పరిస్థితులు సహకరించకపోవడం వల్ల మంటల అదుపులో కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయని వారు తెలిపారు. ఇప్పటివరకు జరిగిన ప్రయత్నాల్లో కేవలం 3 శాతం మాత్రమే మంటలను అదుపులోకి తీసుకురాగలిగామని సోమవారం నాటికి అధికార నివేదికలో పేర్కొన్నారు.
వివరాలు
కార్చిచ్చులో ముగ్గురికి గాయాలు
ఈ మంటల ప్రభావంతో అనేక రహదారులను కూడా తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది. దాంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ కార్చిచ్చులో ముగ్గురు గాయపడగా, బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. గాయపడ్డవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో, అతడిని అత్యవసర వైద్యం కోసం ప్రత్యేక విమానంలో తరలించినట్లు వెల్లడించారు. మరోవైపు, రానున్న రోజుల్లో వాతావరణం మరింత వేడిగా మారే అవకాశముండటంతో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.