
Trump Modi Relations: మోదీ-ట్రంప్ అనుబంధం మాయమైంది.. అమెరికా-భారత్ సంబంధాలపై జాన్ బోల్టన్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు గతంలో వ్యక్తిగతంగా సన్నిహిత అనుబంధం ఉండేదని, కానీ ఇప్పుడు ఆ బంధం మాయమైందని అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ (John Bolton) తెలిపారు. అమెరికా-భారత్‌ల మధ్య సుంకాల వివాదం జరుగుతున్న ఈ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బోల్టన్ మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ సంబంధాలను ఆయా నేతలతో తనకున్న వ్యక్తిగత అనుబంధాల కోణంలోనే అంచనా వేస్తారు. ఉదాహరణకు, పుతిన్ (Vladimir Putin)తో ఆయనకు మంచి సంబంధాలు ఉంటే.. అమెరికా-రష్యా సంబంధాలు కూడా మెరుగ్గా ఉంటాయని భావిస్తారు. కానీ ఇది వాస్తవానికి సాధ్యం కాదు.
Details
వ్యక్తిగత సత్సంబంధాలు కొన్నిసార్లు సాయపడతాయి
మోదీతో కూడా ట్రంప్‌కు ఒకప్పుడు మంచి వ్యక్తిగత సంబంధం ఉండేది. అయితే ఇప్పుడు అది క్రమంగా అంతరించిపోయింది. ఇది ప్రతి ఒక్కరికీ ఒక పాఠం. వ్యక్తిగత సత్సంబంధాలు కొన్నిసార్లు సహాయపడతాయి.. కానీ అన్ని సమస్యల నుండి రక్షించలేవని స్పష్టం చేశారు. ట్రంప్ వైఖరి వల్ల అమెరికా-భారత్ సంబంధాలు వెనకబడిపోయాయి. వైట్ హౌస్ నిర్ణయాలు దశాబ్దాల వెనక్కి నెట్టాయి. దీని ఫలితంగా మోదీ రష్యా, చైనా వైపు మరింత చేరువయ్యారు. ఇదే సమయంలో అమెరికాకు ప్రత్యామ్నాయంగా బీజింగ్ తనను తాను ప్రదర్శించుకుందని వ్యాఖ్యానించారు.
Details
అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన అనుభవం
ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జాన్ బోల్టన్ అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేశారు. అయితే, ట్రంప్ వ్యవహారశైలి నచ్చకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. చివరకు బోల్టన్ తన పదవికి రాజీనామా చేశారు. ఇదిలా ఉండగా, రహస్య పత్రాల దుర్వినియోగం ఆరోపణలపై ఇటీవల ఎఫ్‌బీఐ బోల్టన్ నివాసం, వాషింగ్టన్‌లోని ఆయన కార్యాలయంలో సోదాలు నిర్వహించింది.