Bangladesh: మాకెప్పుడు ఇచ్చారు: $29 మిలియన్ USAID మంజూరుపై బంగ్లాదేశ్
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో ఓటింగ్‌ను పెంచేందుకు జో బైడెన్ పరిపాలనలో అమెరికా అందించిన సహాయంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పదేపదే విమర్శలు చేస్తున్నారు.
యూఎస్‌ఎయిడ్ (USAID) ద్వారా అందిన 21 మిలియన్ డాలర్ల (మన కరెన్సీలో దాదాపు రూ.182 కోట్లు) నిధులపై రాజకీయంగా పెద్ద చర్చ జరుగుతోంది.
బంగ్లాదేశ్ (Bangladesh) కు కూడా యూఎస్‌ఎయిడ్ ద్వారా రూ.251 కోట్లు (29 మిలియన్ డాలర్లు) సహాయంగా అందించామని, ఆ నిధుల ద్వారా వారు కమ్యూనిస్టులకు ఓటేశారని ట్రంప్ ఆరోపించడం తెలిసిందే. ఈ ఆరోపణలపై తాజాగా బంగ్లాదేశ్ స్పందించింది.
వివరాలు
75 ఎన్జీవోలకు విదేశీ నిధులు
''ఆ నిధులు మా ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కాలేదు. ఏయే ఎన్జీవోలు దీనిలో పాత్ర వహించాయో వారు చెబితే, మేము వాటిని గుర్తించగలం. మా పరిధిని దాటి వారు నిధులను ఎలా పంపించారో మాకు తెలియదు'' అని బంగ్లాదేశ్ ఎన్జీవో వ్యవహారాల బ్యూరో చీఫ్ తెలిపారు.
అంతేకాకుండా, 75 ఎన్జీవోలకు విదేశీ నిధులు అందుతున్నట్లు వెల్లడించారు.
విదేశీ దాతలు నమోదిత ఎన్జీవోలకు విరాళాలు ఇస్తే, ఆ వివరాలు తమ రికార్డుల్లో ఉంటాయని స్పష్టం చేశారు.
యూఎస్‌ఎయిడ్ ద్వారా ప్రభుత్వానికి అందిన నిధులు ఏజెన్సీలకు బదిలీ అయితే, ఆ లెక్కలు తమ వద్ద ఉండవని తెలియజేశారు.
వివరాలు
నిధుల గురించి స్పష్టత ఇచ్చిన భారతదేశం
భారతదేశం కూడా ఈ నిధుల గురించి స్పష్టత ఇచ్చింది. యూఎస్‌ఎయిడ్ ద్వారా భారత్‌లోని 7 ప్రాజెక్టులకు 2023-24లో రూ.6,498 కోట్లు (750 మిలియన్ డాలర్లు) నిధులు వచ్చాయని, అయితే అవి ఎన్నికల్లో ఓటింగ్‌ను పెంచేందుకు కాదని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది.
భారత ప్రభుత్వంతో కలిసి యూఎస్‌ఎయిడ్ కొన్ని ప్రాజెక్టులపై పని చేస్తోందని తెలిపింది.
అమెరికా సహాయంపై రాజకీయ దుమారం రేగుతున్న సమయంలో కేంద్ర ఆర్థికశాఖ ఈ వివరణ ఇచ్చింది.
ఎన్నికల్లో ఓటింగ్‌ను పెంచేందుకు ఎటువంటి నిధులు అందలేదని స్పష్టం చేసింది.