Moscow: మాస్కో కాన్సర్ట్ హాల్ దాడి నిందితుల నేరం అంగీకారం
Moscow: మాస్కో ఉగ్రదాడిలో (Moscow concert attack) నలుగురు ముష్కరుల్లో ముగ్గురు నేరం అంగీకరించారు. తుపాకులు, బాంబులతో దాడి చేసినవారిలో తామూ ఉన్నామని తమ నేరాన్ని ఆదివారం కోర్టు ముందు వెల్లడించారు. తజకిస్థాన్‌కు చెందిన ఈ నలుగురినీ మే 22 వరకు కస్టడీలోకి తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పటివరకు ఈ ఉగ్రవాద దాడిలో పోలీసులు మొత్తం ఏడుగురు అనుమానితులను అరెస్టు చేశారు. వారిలో నలుగురిని కోర్టులో హాజరుపరిచారు.
అఫ్గానిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్నట్లు అనుమానం
నిందితులను ఆఫ్ఘానిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఇస్లామిక్ స్టేట్-ఖొరాసన్ ఉగ్రముఠాకు చెందినవారిగా అనుమానిస్తున్నారు. ముగ్గురు నేరాన్ని అంగీకరించారు అయితే మరొకర్ని అసలు మాట్లాడలేని స్థితిలో కోర్టుకు తీసుకొచ్చారు. మొత్తం విచారణలో అతడు వీల్‌ఛైర్‌లో కళ్లు మూసుకొని కనిపించాడు. మిగిలిన ముగ్గురూ తీవ్ర గాయాలతో కనిపించారు. దర్యాప్తు సమయంలో బలగాలు చేయి చేసుకొని ఉంటారని రష్యన్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీటిలో వాస్తమెంత అనేది తెలియాల్సి ఉంది.
డబ్బు కోసమే దాడి
స్థానిక మీడియా ప్రచురణ మేరకు నిందితులను రష్యా-బెలారస్ సరిహద్దుల్లోని ఓ గ్రామంలో బంధించి విచారించినట్లు సమాచారం. నిందితులకు దాదాపు 5,425 డాలర్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. డబ్బు కోసమే వారు ఈ కాల్పులు జరిపినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా వార్త అందినట్టు స్థానిక మీడియా ప్రచురించింది.
టెలిగ్రాం ఛానళ్లలో వీడియోలు
రష్యా (Russia) టెలిగ్రాం ఛానళ్లలో నిందితులకు సంబంధించి అనేక వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. చెవిపై తీవ్ర గాయంతో ఓ నిందితుడు అడవి మార్గం ద్వారా బయటకు వస్తున్నట్లు వీడియోల్లో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. మరో వీడియోలో దర్యాప్తు అధికారులకు అదే వ్యక్తి మోకాళ్లపై కూర్చొని సమాధానం ఇస్తున్నట్లు ఉందని తెలిపింది. అయితే మార్చి 23న క్రాకస్ హాల్‌లో జరిగిన మారణకాండకు సంబంధించినదిగా అనుమానిస్తున్న ఓ వీడియోను, నిందితుల్లో ఒకడిగా భావిస్తున్న ఓ వ్యక్తి ఫొటోతో సహా ఇస్లామిక్ స్టేట్ శనివారం విడుదల చేసింది.
ఉక్రెయిన్ ప్రమేయం: పుతిన్ వెల్లడి
ముష్కరులు ఉక్రెయిన్‌కు పారిపోయే ప్రయత్నంలో పట్టుబడ్డారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. జరిగిన దాడికి తమకు ప్రమేయం లేదని ఉక్రెయిన్ తోసిపుచ్చిన నేపథ్యంలో పుతిన్ ఆదివారం ఈ ప్రకటన చేశారు. అఫ్గాన్‌కు చెందిన ఇస్లామిక్ స్టేట్ గ్రూపు ఈ కాల్పులకు తామే చేసినట్టు చెప్పినా, పుతిన్ మాత్రం ఆ విషయం ప్రస్తావించలేదు. నలుగురూ అనుమానితులు సిద్ధం చేసుకున్న మార్గం ద్వారా ఉక్రెయిన్ వైపు తప్పించుకోవాలని ప్రయత్నించారని, తమ బలగాలు పట్టుకున్నాయని పుతిన్ చెప్పారు. మొత్తం 11 మందిని అదుపులో తీసుకున్నట్లు తెలిపారు. ఈ దాడిని రక్తపాత, అనాగరిక ఉగ్రచర్యగా అభివర్ణించారు.