Page Loader
Suchir Balaji death:నా కుమారుడిని మృతికి 'ఓపెన్‌ఏఐ' కారణం.. పూర్ణిమ రావు సంచలన ఆరోపణలు
నా కుమారుడిని మృతికి 'ఓపెన్‌ఏఐ' కారణం.. పూర్ణిమ రావు సంచలన ఆరోపణలు

Suchir Balaji death:నా కుమారుడిని మృతికి 'ఓపెన్‌ఏఐ' కారణం.. పూర్ణిమ రావు సంచలన ఆరోపణలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 17, 2025
08:35 am

ఈ వార్తాకథనం ఏంటి

చాట్‌జీపీటీ మాతృ సంస్థ అయిన 'ఓపెన్‌ఏఐ'లో నాలుగేళ్లుగా పరిశోధకుడిగా పనిచేసిన భారత సంతతికి చెందిన సుచిర్‌ బాలాజీ (వయసు 26) అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం అందరికీ తెలిసిన విషయం. ఈ ఘటనపై అతని తల్లి పూర్ణిమ రావు సంచలన ఆరోపణలు చేసారు. ఆమె ప్రకారం, ''ఓపెన్‌ఏఐ సంస్థ నా కుమారుడిని హత్య చేసింది,'' అని చెప్పారు. సుచిర్‌ వద్ద ఓపెన్‌ఏఐకి వ్యతిరేకంగా కీలకమైన ఆధారాలు ఉన్నాయని, ఆ సంస్థ రహస్యాలను ఇతరులకు వెల్లడించకుండా ఉండేందుకే అతడిని హత్య చేసారని పూర్ణిమ ఆరోపించారు. అమెరికాలో టక్కర్‌ కార్లసన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో పూర్ణిమ రావు ఈ విషయాలను మరింత వివరించారు.

వివరాలు 

ఆత్మహత్య చేసుకోవాలనుకునే వ్యక్తి ఇలాంటి వేడుకలు చేస్తాడా: పూర్ణిమ 

''నా కుమారుడు చనిపోవడానికి ఒకరోజు ముందు పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవాలనుకునే వ్యక్తి ఇలాంటి వేడుకలు చేస్తాడా? తన తండ్రి పంపిన బహుమతులను చనిపోయే రోజునే స్వీకరించాడంటే ఆత్మహత్య అనేది అసాధ్యమే,'' అని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ''ఓపెన్‌ఏఐకి వ్యతిరేకంగా సుచిర్‌ వద్ద ఆధారాలు ఉండటం వల్లనే అతడిని హత్య చేశారు.అతడి మరణం తరువాత కొన్ని కీలకమైన పత్రాలు కనిపించకుండా పోయాయి.చాట్‌జీపీటీ రూపకర్తలు విచారణపై ప్రభావం చూపారు.ఈ విషయం గురించి తెలిసిన సాక్షులను అదుపులో ఉంచారు. నిజం చెప్పడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. న్యాయవాదులు కూడా దీన్ని ఆత్మహత్యగా పేర్కొన్నారు. నా కుమారుడి మరణం 14 నిమిషాల వ్యవధిలోనే ఆత్మహత్యగా తేల్చేయడం అనుమానాస్పదం,'' అని ఆమె తెలిపారు.

వివరాలు 

 అపార్ట్‌మెంట్‌లో సుచిర్‌ బాలాజీ  మృతి 

పూర్తి వివరాలు వెల్లడించడంలో అధికారులు పారదర్శకంగా వ్యవహరించలేదని పూర్ణిమ పేర్కొన్నారు. ఎలాన్‌ మస్క్‌ ఈ ఇంటర్వ్యూ పోస్టును తన ఎక్స్‌ అకౌంట్‌లో షేర్ చేస్తూ ఈ ఘటన తీవ్ర ఆందోళన కలిగించేదిగా పేర్కొన్నారు. గత ఏడాది నవంబర్‌ 26న శాన్‌ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్‌మెంట్‌లో సుచిర్‌ బాలాజీ మరణించాడు. ఈ విషయమై పోలీసులు ప్రారంభ దర్యాప్తు అనంతరం దాన్ని ఆత్మహత్యగా ప్రకటించారు. కానీ ఈ ఘటనపై పూర్ణిమ రావు న్యాయ పోరాటానికి దిగారు. తమ కుమారుడి మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రైవేట్‌ ఇన్వెస్టిగేటర్‌ను నియమించి, మరలా శవపరీక్ష నిర్వహించారు. ఈ ఫలితాలు మొదటగా పోలీసుల వివరాల కంటే భిన్నంగా ఉన్నాయని వెల్లడించారు.

వివరాలు 

ఇది ఆత్మహత్యగా అనిపించడం లేదు: ఎలాన్‌ మస్క్‌

''సుచిర్‌ అపార్ట్‌మెంట్‌లో దోపిడీ జరిగినట్టు కనిపిస్తోంది. బాత్‌రూమ్‌లో ఘర్షణకు గుర్తులు ఉన్నాయి. రక్తపు మరకలు కనబడుతున్నాయి. ఎవరో అతడిని కొట్టి హత్య చేశారని అనిపిస్తోంది. ఈ హత్యను ఆత్మహత్యగా మార్చారు. మాకు న్యాయం కావాలి. ఈ దారుణంపై ఎఫ్‌బీఐతో విచారణ జరిపించాలని కోరుతున్నాం,'' అని పూర్ణిమ అన్నారు. ఈ ఘటనపై ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ వ్యాఖ్యానిస్తూ, ''ఇది ఆత్మహత్యగా అనిపించడం లేదు,'' అని ట్వీట్ చేశారు.