
Neela Rajendra: ట్రంప్ ఉత్తర్వులు.. నాసా డీఈఐ చీఫ్ నీలా రాజేంద్ర తొలగింపు
ఈ వార్తాకథనం ఏంటి
నాసాలో కీలక బాధ్యతలు నిర్వహించిన భారతీయ సంతతికి చెందిన ఉద్యోగి నీలా రాజేంద్రను సంస్థ నుంచి తొలగించారు.
ఆమె డైవర్సిటీ,ఈక్విటీ,ఇన్‌క్లూజన్ (డీఈఐ) విభాగానికి చీఫ్‌గా పని చేశారు.
ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆదేశాల ప్రభావంతో ఆమెకు ఉద్యోగం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.
దేశవ్యాప్తంగా ఈ రకమైన కార్యక్రమాలను రద్దు చేయాలన్న ఆదేశాలే ఆమెపై ప్రభావం చూపాయి.
ప్రారంభంలో నాసా, నీలా రాజేంద్రను తొలగించకుండా మరో హోదాలో నియమించింది.
ఆమెను 'టీమ్ ఎక్సలెన్స్ అండ్ ఎంప్లాయి సక్సెస్' విభాగానికి హెడ్‌గా నియమించారు.
ఈ హోదా ట్రంప్ ఆదేశాల అనంతరం ఆమెకు ఇవ్వబడింది. ఆమెను కాపాడే ఉద్దేశంతో ఈ మార్పు చేసినా, చివరకు ఆ ప్రయత్నం వృథా అయింది.
వివరాలు
900 మంది ఉద్యోగులపై నాసా వేటు
గత వారం నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ (JPL) ఒక ఈమెయిల్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది.
నాసాలో పనిచేస్తున్న ఉద్యోగులకు నీలా రాజేంద్రను తొలగించిన విషయం గురించి ఈమెయిల్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.
ఇకపై ఆమె జెట్ ప్రొపల్షన్ ల్యాబ్‌లో పని చేయడం లేదని,సంస్థకు ఆమె అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఆమె భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా,గత సంవత్సరం డీఈఐ విభాగంలో పనిచేస్తున్న 900 మంది ఉద్యోగులపై నాసా వేటు వేసింది.
అయితే అప్పుడు నీలా రాజేంద్రను మాత్రం తొలగించలేదు.మార్చి నెలలో ట్రంప్ ఆదేశాలపై స్పందించిన నాసా, డైవర్సిటీ విభాగాన్ని మూసివేసింది. అయినప్పటికీ, రాజేంద్ర తన ఉద్యోగాన్ని కొనసాగించారు.
వివరాలు
నాసాలో కీలకమైన నాయకత్వ హోదాల్లో నీలా రాజేంద్ర
హోదా మారినా, ఆమె అదే విధంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె కోసం ప్రత్యేకంగా కొత్త విభాగాన్ని కూడా సృష్టించారు.
తాజాగా, లింక్డిన్‌లో తన ప్రొఫైల్‌ను మార్పు చేసిన కొన్ని రోజుల్లోనే ట్రంప్ ఆదేశాలను కఠినంగా అమలు చేస్తూ నాసా ఆమెను ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.
నీలా రాజేంద్ర, నాసాలో కీలకమైన నాయకత్వ హోదాల్లో చాలా కాలం పాటు సేవలందించారు. డైవర్సిటీ విభాగ ఇన్‌ఛార్జిగా ఆమె సేవలు అందించారు.