Joe Biden: నస్రల్లా మృతి న్యాయమైనదే.. జో బైడెన్
ఇజ్రాయెల్ బీరుట్‌పై నిర్వహించిన దాడుల్లో హెజ్‌బొల్లా నేత షేక్ హసన్ నస్రల్లా మృతి చెందారు. ఈ నేపథ్యంలో నస్రల్లా హత్యను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ న్యాయసమ్మతమైన చర్యగా పేర్కొంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. గతేడాది ప్రారంభమైన యుద్ధంలోనే నస్రల్లాను లక్ష్యంగా చేసుకున్న ఆపరేషన్ ప్రారంభమైందని చెప్పారు. ఇరానియన్ మద్దతుగల ఉగ్రవాద గ్రూపులైన హెజ్‌బొల్లా, హమాస్‌లపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని బైడెన్ మరోసారి స్పష్టం చేశారు. నస్రల్లా నేతృత్వంలోని హెజ్‌బొల్లా కారణంగా వేలాది మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయినట్లు బైడెన్ గుర్తు చేశారు.
అమెరికన్ పౌరులు ఆ ప్రాంతాన్ని వీడాలి
అదేవిధంగా మధ్య ప్రాచ్యంలోని యూఎస్ సైనిక దళాల భద్రతను మరింత పటిష్ఠం చేయాలని రక్షణ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. బీరుట్‌లో తలెత్తిన భద్రతా పరిస్థితుల దృష్ట్యా, అక్కడ ఉన్న దౌత్యవేత్తల కుటుంబసభ్యులు, అమెరికన్ పౌరులు ఆ ప్రాంతాన్ని వీడాలని విదేశాంగ శాఖ పేర్కొంది. ఇజ్రాయెల్ బీరుట్‌లోని హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై క్షిపణి దాడులు నిర్వహించగా, ఈ దాడుల్లో నస్రల్లా సహా, ఆయన కుమార్తె కూడా మరణించారని పలు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. పాలస్తీనా కోసం తమ పోరాటం కొనసాగిస్తామని, తమ శత్రువులకు ఎదురు నిలుస్తామని హెజ్బొల్లా స్పష్టం చేసింది.