Mass Layoffs: 10,000 మంది కార్మికులను తొలగించిన ట్రంప్ సర్కార్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో ప్రభుత్వ ఖర్చులను తగ్గించేందుకు ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సలహాదారు, డోజ్ చీఫ్ ఎలాన్ మస్క్ ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే 75,000 మంది ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ సూచించిన ట్రంప్ ప్రభుత్వం, తాజాగా మరో 9,500 మందికి ఉద్యోగాల కోత విధించింది.
తొలగింపునకు గురైన వారిలో ఫెడరల్ భూముల నిర్వహణలో ఉన్న ఉద్యోగులు, మిలిటరీ అధికారుల సంరక్షణలో పనిచేసే ఉద్యోగులు, అలాగే ఇంటీరియర్, ఎనర్జీ, వెటరన్స్ అఫైర్స్, వ్యవసాయం, ఆరోగ్య మరియు మానవ సేవల శాఖలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు.
వివరాలు
వ్యయ నియంత్రణ, సామర్థ్యం పెంపు కోసం ఏజెన్సీల మూసివేత అమలు
ఈ నేపథ్యంలో, ఫెడరల్ ఏజెన్సీల సంఖ్య తగ్గించాల్సిన అవసరం వచ్చిందని ఎలాన్ మస్క్ ఇప్పటికే ప్రకటించారు.
ప్రభుత్వ వ్యవస్థను సమూలంగా మార్చేందుకు ఈ చర్య తప్పనిసరని ఆయన స్పష్టం చేశారు.
వ్యయ నియంత్రణ, సామర్థ్యం పెంపు కోసం ఏజెన్సీల మూసివేతలను అమలు చేయాలని సూచించారు.
ఫెడరల్ వర్క్‌ఫోర్స్ పరిమాణాన్ని తగ్గించేందుకు, అనుభవం తక్కువ ఉన్న (ప్రొబేషనరీ) ఉద్యోగులను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.
అయితే, నిబంధనలను పరిగణనలోకి తీసుకుని లా ఎన్‌ఫోర్స్‌మెంట్, నేషనల్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ విభాగాలకు ఈ కోతల నుండి మినహాయింపు ఇచ్చారు.
వివరాలు
బైఅవుట్ ప్యాకేజీ ప్రకటన
అమెరికాలో పోస్టల్ సేవల మినహాయించి సుమారు 23 లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులు వివిధ శాఖల్లో పని చేస్తున్నారు.
వీరిలో మిలిటరీ, భద్రతా సంస్థలు పెద్ద శాతం ఉన్నప్పటికీ, మాజీ సైనికుల ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం పర్యవేక్షణ, ప్రభుత్వ బిల్లుల నిర్వహణ వంటి రంగాల్లో లక్షలాది మంది పనిచేస్తున్నారు.
ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు ట్రంప్ ప్రభుత్వం బైఅవుట్ ప్యాకేజీ ప్రకటించింది.
ఫిబ్రవరి 6లోగా స్వచ్ఛందంగా పదవీ విరమణ తీసుకున్న వారికి 8 నెలల జీతం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
అయితే, ఈ నిర్ణయంపై ఫెడరల్ కోర్టు స్టే విధించింది. దీంతో ఈ చర్యకు తాత్కాలికంగా బ్రేక్ పడినప్పటికీ, ఉద్యోగాల కోత నిర్ణయం ఆగిపోకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.