
Nikki Haley: ట్రంప్ హెచ్చరికలపై స్పందించాల్సిందే.. భారత్‌కు నిక్కీ హేలీ సూచన!
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా నుంచి చమురు దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) లేవనెత్తిన అభ్యంతరాలను భారతదేశం (India) అత్యంత గంభీరంగా పరిగణించాలని అమెరికా రిపబ్లికన్ నేత, భారత మిత్రురాలిగా గుర్తింపు పొందిన నిక్కీ హేలీ (Nikki Haley) సూచించారు. న్యూదిల్లీ-వాషింగ్టన్ మధ్య నెలకొన్న తాజా విభేదాలపై ఆమె ఎక్స్ (X) వేదికగా స్పందించారు. రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో ట్రంప్ ఉంచిన అభ్యంతరాలను భారత్ సీరియస్‌గా తీసుకోవాలి. వీలైనంత త్వరగా శ్వేతసౌధంతో (White House) కలసి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలి. రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న స్నేహం, విశ్వాసమే ప్రస్తుత ఉద్రిక్తతలను అధిగమించేందుకు బలమైన పునాదిగా ఉంటుందని హేలీ పేర్కొన్నారు.
Details
వేగంగా ఎదుగుతున్నఆర్థిక వ్యవస్థగా భారత్
వాణిజ్య సమస్యలు, రష్యా చమురు వివాదం వంటి అంశాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ఆమె హితవు పలికారు. చైనాను(China)ఎదుర్కోవడానికి అమెరికాకు న్యూదిల్లీలో మిత్రులు అవసరం. ఆ విషయాన్ని ఏ మాత్రం విస్మరించరాదని ఆమె స్పష్టం చేశారు. ఇంతకు ముందూ అమెరికా భారత్‌పై ఆంక్షలు విధించడం సరైంది కాదని నిక్కీ హేలీ తీవ్రంగా విమర్శించారు. చైనాను ఎదుర్కోవాలన్న వ్యూహాత్మక లక్ష్యాల సాధనకు ట్రంప్ నిర్ణయాలు విపత్కరమని వ్యాఖ్యానించారు. ఇటీవల ఓ పత్రికలో రాసిన కాలమ్‌లో *"ప్రపంచంలో ఆరవ వంతు జనాభా భారత్‌లోనే ఉంది. అత్యంత యువ జనాభాతో చైనాను కూడా దాటేసింది. మరోవైపు డ్రాగన్ దేశంలో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్ అని ఆమె రాశారు.
Detail
చమురు దిగుమతులపై అమెరికా తీవ్ర అభ్యంతరాలు
మరోవైపు, భారత మిత్రదేశాలతో దౌత్యపరమైన విభేదాలను సృష్టించడం సరికాదని మాజీ అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ (John Kerry) కూడా అభిప్రాయపడ్డారు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు భారత్‌ను దూరం చేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీ మధ్య ఈ పోరాటం దురదృష్టకరం. దౌత్య చర్చలకన్నా అల్టిమేటంలు జారీ చేయడం సరైన పద్ధతి కాదు. ఒబామా పాలనలో పరస్పర గౌరవం, సహకారంతో చర్చలు జరిగేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులపై అమెరికా ఇంకా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.
Details
భారతీయులు ఇబ్బందులు పడే అవకాశం
ఈ డబ్బు ఉక్రెయిన్ యుద్ధానికి ఉపయోగపడుతోందని ట్రంప్ సలహాదారు పీటర్ నవారో (Peter Navarro) ఆరోపించారు. భారత్ దిగుమతులపై ట్రంప్ 25 శాతం పెనాల్టీ విధించారు. ఆయన కార్యవర్గం తరచుగా న్యూదిల్లీపై నోరు పారేసుకుంటోందని విమర్శలు వస్తున్నాయి. అయితే భారత్ లో మాత్రం చమురు ధరలు పెరిగితే 150 కోట్ల మంది భారతీయులు తీవ్ర ఇబ్బందులు పడతారని వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్నాయి.