Page Loader
Donald Trump: అమెరికా మరోసారి టారిఫ్‌ల దాడి .. భారత్‌పై ప్రభావం ఎంత?
అమెరికా మరోసారి టారిఫ్‌ల దాడి .. భారత్‌పై ప్రభావం ఎంత?

Donald Trump: అమెరికా మరోసారి టారిఫ్‌ల దాడి .. భారత్‌పై ప్రభావం ఎంత?

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 09, 2025
09:47 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించిన భారీ దిగుమతి సుంకాల నిర్ణయాలు ప్రపంచ వాణిజ్య రంగంలో కుదుపులు తేనున్నాయి. ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఇది ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. ట్రంప్ తాజా ప్రకటనలలో భాగంగా,కాపర్ దిగుమతులపై 50 శాతం టారిఫ్‌ అమలులోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు. అంతేకాదు,ఔషధాలపై కూడా 200 శాతం వరకూ సుంకాలు విధించే అవకాశం ఉందని హెచ్చరించారు.

వివరాలు 

భవిష్యత్తులో మరిన్ని టారిఫ్‌లు విధించే అవకాశం 

ఈ ప్రకటన అనంతరం అంతర్జాతీయంగా కాపర్ ధరలు గణనీయంగా పెరిగాయి. అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ప్రకారం, ఈ కొత్త టారిఫ్ జులై చివరిలో లేదా ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించారు. అంతేకాదు, అమెరికా దిగుమతులపై జరుగుతున్న సమీక్షల ప్రక్రియలో ఔషధాలు, సెమీకండక్టర్లు, లాంబర్, క్రిటికల్ మినరల్స్ వంటి కీలక రంగాలపై భవిష్యత్తులో మరిన్ని టారిఫ్‌లు విధించే అవకాశముందని తెలిపారు. ఏడాది వ్యవధిలోగా ఉత్పత్తిదారులు తమ ప్లాంట్లను అమెరికాలోకి తరలించకపోతే, వారికి 200 శాతం టారిఫ్‌లు విధించబడతాయని ట్రంప్ స్పష్టం చేశారు.

వివరాలు 

కాపర్‌ దిగుమతుల విషయంలో అమెరికా మూడవ అతిపెద్ద కొనుగోలుదారు

ఇప్పుడు భారత్‌ పరంగా చూస్తే.. కాపర్‌ దిగుమతుల విషయంలో అమెరికా మూడవ అతిపెద్ద కొనుగోలుదారుగా ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ మొత్తం 2 బిలియన్ డాలర్ల విలువగల కాపర్, కాపర్‌ ఆధారిత ఉత్పత్తులను ఎగుమతి చేయగా, ఇందులో 360 మిలియన్ డాలర్ల విలువైన భాగం అమెరికాకు సాగింది. కాపర్ వినియోగం ప్రధానంగా విద్యుత్‌, తయారీ, మౌలిక వసతుల రంగాల్లో విస్తరించి ఉండటం వల్ల, అమెరికాలో డిమాండ్‌ తగ్గినా, భారత పరిశ్రమ దాన్ని తట్టుకునే అవకాశాలున్నాయి. అయితే అసలైన ప్రభావం ఔషధ రంగంలోనే కనిపించే అవకాశం ఉంది.అమెరికా,భారతదేశానికి అతిపెద్ద ఔషధ దిగుమతిదారుగా నిలుస్తోంది. 2024-25లో అమెరికాకు భారత ఔషధ ఎగుమతులు సుమారు 9.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

వివరాలు 

భారత్-అమెరికా మధ్య చిన్న స్థాయి వాణిజ్య ఒప్పందంపై చర్చలు

ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 21 శాతం వృద్ధిని సూచిస్తోంది. భారత ఔషధ ఎగుమతుల్లో 40 శాతం వాటా అమెరికా ఖాతాలోనే ఉంది. అలాంటి పరిస్థితిలో, వీటిపై 200 శాతం టారిఫ్‌ విధిస్తే, భారత జనరిక్‌ ఔషధ పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొనాల్సి వస్తుంది. ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య చిన్న స్థాయి వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ ఒప్పందంలో వివిధ రంగాలకు సంబంధించి టారిఫ్‌లపై చర్చ కొనసాగుతోంది. ఆగస్టు 1 నాటికి ఈ ఒప్పందం ఫలితంగా పూర్తవుతుందని భావిస్తే, ట్రంప్ ప్రతిపాదించిన కొత్త టారిఫ్‌ల ప్రభావం నుంచి భారత మార్కెట్లు కొంతవరకూ రక్షణ పొందే అవకాశం ఉంది.