
Trump Warning India: బ్రిక్స్‌లో భాగమైన భారత్‌ను కూడా వదిలిపెట్టం… అదనంగా 10% సుంకం తప్పనిసరి: ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
బ్రిక్స్ కూటమిలో సభ్యత్వం ఉన్న దేశాలపై అమెరికా తన విధానాన్ని స్పష్టంగా ప్రకటించింది. బ్రిక్స్‌లో భాగమైన భారత్ సహా ఏ దేశానికీ మినహాయింపులుండవని, అందరూ అదనంగా 10 శాతం దిగుమతి సుంకం చెల్లించాల్సిందేనని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇటీవల బ్రెజిల్‌లో సమావేశమైన బ్రిక్స్ దేశాల 11 సభ్య దేశాలు ట్రంప్ ప్రతీకార ధోరణులను తప్పుబట్టిన నేపథ్యంలో ఆయన ఈ హెచ్చరికలు చేశారు. ''మీరు మమ్మల్ని గుడ్డిగా విమర్శిస్తున్నారా? మా డాలర్ విలువను దిగజార్చాలనుకుంటున్నారా?'' అంటూ ట్రంప్ ఆగ్రహంతో స్పందించారు. బ్రిక్స్ దేశాల ధోరణిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, తమ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
వివరాలు
డాలర్ ఎప్పటికీ రారాజే.. దాన్ని నిలబెట్టడం మా ధ్యేయం
బ్రిక్స్ కూటమి పెద్దగా ప్రమాదకరం కాదన్నప్పటికీ, అమెరికా డాలర్‌కు నష్టం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని ట్రంప్ విమర్శించారు. అలాంటి యత్నాలను సహించేది లేదని, ఆ దేశాలు గేమ్ ఆడితే తాను మరింత బలంగా గేమ్ ఆడతానని తెలిపారు. ''డాలర్ ఎప్పటికీ రారాజే.. దాన్ని నిలబెట్టడం మా ధ్యేయం,'' అని స్పష్టం చేశారు ట్రంప్. డాలర్ ప్రభావాన్ని ఎవరు సవాలు చేయాలన్నా వారు తీవ్రమైన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. శ్వేతసౌధంలోని ఆరో కేబినెట్ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
బ్రిక్స్ 'రియో డిక్లరేషన్'ను వ్యతిరేకించిన ట్రంప్
భారత్‌తో అమెరికా సంబంధాలు బాగున్నాయని అందరూ భావించినా, ట్రంప్ మాత్రం అందరికీ ఒకేలా వ్యవహరిస్తామన్నారు. బ్రిక్స్ దేశాల్లో భాగమైనవారెవరైనా అదనపు 10 శాతం సుంకం విధించబడుతుందని ఆయన స్పష్టం చేశారు. భారత్, చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా సహా బ్రిక్స్‌లో ఉన్న 11 దేశాలు ప్రపంచ జీడీపీలో సుమారు 40 శాతం వాటాను కలిగి ఉండగా, ప్రపంచ జనాభాలో సగానికి పైగా వీటిదే. ఈ కారణంగానే బ్రిక్స్ 'రియో డిక్లరేషన్'ను ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. భారత్ అమెరికాకు ముఖ్యమైన వ్యాపార భాగస్వామిగా ఉన్నప్పటికీ, ఈసారి మినహాయింపులు ఉండవని ఆయన తేల్చిచెప్పారు.
వివరాలు
అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయంలో భారత్ ఆశలు
ఇదిలా ఉండగా, అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయంలో భారత్ ఆశలు పెట్టుకున్న తరుణంలో ట్రంప్ చేసిన ఈ ప్రకటన ఆశ్చర్యానికి గురి చేసింది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు చేర్చే లక్ష్యంతో పాటు, రక్షణ, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని అభివృద్ధి చేయాలని ఉద్దేశ్యంతో రెండు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. అయితే, భారత్ తమ నిబంధనలకు ఒప్పుకోకపోతే... వచ్చే ఆగస్టు 1వ తేదీ నుంచి 10 శాతం సుంకాలు అమలులోకి వస్తాయని, ఈసారి ఎలాంటి వాయిదా లేదా గడువు పొడిగింపు ఉండదని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ట్రూత్ సోషల్'లో తెలిపారు.