
USA-China: టిబెట్ అంశంలో జోక్యం చేసుకోవద్దు.. అమెరికాకు చైనా హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
దలైలామా వారసత్వ అంశం ఇటీవల తీవ్ర చర్చలకు దారితీసింది. ఈ నేపథ్యంలో టిబెట్ అంశంలో అమెరికా జోక్యం చేసుకుంటోందని పేర్కొంటూ చైనా తీవ్ర అభ్యంతరం తెలిపింది. ప్రస్తుత దలైలామా 90వ జన్మదిన సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి దారితీశాయి. రూబియో, దలైలామాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన టిబెట్ నాయకుడిగా ప్రపంచానికి ఐక్యత, శాంతి, కరుణ సందేశాన్ని వినిపిస్తున్నారని కొనియాడారు. అలాగే టిబెట్ ప్రజలకు తమ ఆధ్యాత్మిక నాయకుడిని ఎన్నుకునే స్వేచ్ఛ, మతపరమైన గుర్తింపును కాపాడుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు చైనాకు తీవ్రంగా తగిలాయి. ఈ వ్యాఖ్యలపై బీజింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
వివరాలు
అమెరికా వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తోంది: చైనా
చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ..''దలైలామా మతపరమైన హోదాను అడ్డుపెట్టుకొని చైనా వ్యతిరేక వేర్పాటువాద కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.టిబెట్ ప్రజలకు ఆయనను ప్రాతినిధ్యం వహించే హక్కు లేదు.అలాగే భవిష్యత్తులో ఆ ప్రాంత నిర్ణయాల్లో ఆయనకు పాత్ర ఉండదు. ఇలాంటి అంశాల్లో అమెరికా జోక్యం అవసరం లేదు. ఇది అత్యంత సున్నితమైన అంశం అనే విషయం యూఎస్ గుర్తుంచుకోవాలి,''అని హెచ్చరించారు. అంతేకాకుండా అమెరికా వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఇదిలా ఉండగా, భవిష్యత్తులో తన వారసత్వం కొనసాగుతుందని ఇటీవల దలైలామా పేర్కొన్న సంగతి తెలిసిందే. తమ వారసుడి ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని, ఆ హక్కు గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్టుకు మాత్రమే ఉందని, ఇతరులు జోక్యం చేసుకునే అధికారం లేదని పరోక్షంగా చైనాకు తేల్చి చెప్పారు.
వివరాలు
మత విశ్వాసాలు,ఆచారాల్లో జోక్యం చేసుకునే విధానం భారత్ ది కాదు
ఇదే సమయంలో టిబెట్‌పై తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు భవిష్యత్తులో దలైలామా స్థానాన్ని నియంత్రించాలని చైనా భావిస్తోంది. దలైలామా వ్యాఖ్యలపై చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వారసుడి ఎంపికలో తమ అంగీకారం తప్పనిసరిగా ఉండాలంటూ డిమాండ్ చేసింది. ఇక కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు .. ''దలైలామా వారసుడి ఎంపిక పూర్తి హక్కు ఆయనకే ఉంది,'' అని స్పష్టం చేశారు. ఈ పరిణామాల మధ్య,దలైలామా అంశంలో భారత జోక్యంపై కూడా చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే భారత్ దీనిపై స్పందిస్తూ.. మత విశ్వాసాలు,ఆచారాల్లో జోక్యం చేసుకునే విధానం తమది కాదని స్పష్టంగా పేర్కొంది.