కిమ్‌కు మళ్లీ నిరాశే .. ఉత్తరకొరియా నిఘా ఉపగ్రహం ప్రయోగం మరోసారి విఫలం
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ప్రభుత్వానికి మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అంతరిక్షంలోకి నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఉద్దేశించిన ప్రయోగం విఫలమైంది. మూడు నెలల వ్యవధిలోనే రెండు సార్లు వైఫల్యం ఎదురైంది. అంతరిక్షంలోకి నిఘా ఉపగ్రహాన్ని పంపించాలని భావించిన ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కు మళ్లీ నిరాశే మిగిలింది. గురువారం ఉదయం నార్త్ కొరియా చేపట్టిన నిఘా ఉపగ్రహ ప్రయోగం బెడిసికొట్టింది. 3నెలల క్రితం తొలిసారిగా చేసిన రాకెట్ ప్రయోగం సముద్రంలో కుప్పకూలిపోయింది. తాజా ప్రయోగంలో మూడో దశలో సదరు రాకెట్ నిరాశపర్చినట్లు కొరియన్ మీడియా కేసీఎన్‌ఏ కథనాలు వెలువరించింది. రాకెట్ మూడో దశలో ఎమర్జెన్సీ బ్లాస్టింగ్ వ్యవస్థలో సాంకేతిక లోపంతో ప్రయోగం దెబ్బతిందని పేర్కొంది.
రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని అమెరికా హెచ్చరికలు
యుద్ధ సమయంలో శత్రుదేశాలపై నిఘా ఏర్పాటు చేయడం,కొరియన్ పైలట్లకు సహాయంగా ఉండేలా నిఘా ఉపగ్రహ ప్రాజెక్టును చేపట్టారు. రెండో ప్రయోగం విఫలమైన సందర్భంగా ఉత్తర కొరియా స్పేస్ ఏజెన్సీ స్పందించింది. ఈ మేరకు అక్టోబర్‌లో మరోసారి ప్రయోగిస్తామని ప్రకటన చేసింది. ఎల్లో సీ మీదుగా ఉత్తరకొరియా రాకెట్‌ను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా నిఘా విభాగం గుర్తించింది. ఈ మేరకు జపాన్ గగనతల రక్షణ వ్యవస్థ ప్రజలకు ఎమర్జెన్సీ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరకొరియా రాకెట్ ప్రయోగాన్ని ఖండించిన జపాన్ ప్రధాని కిషిదా, ఐరాస తీర్మానాలకు విరుద్ధంగా కిమ్ ప్రవర్తనపై అసహనం వ్యక్తంచేశారు. రెచ్చగొట్టే చర్యలను మానుకోవాలని అమెరికా సూచించింది. యూఎస్, జపాన్, దక్షిణకొరియా వాషింగ్టన్‌లో సమావేశమయ్యాక కిమ్ ఈ ప్రయోగం చేయడం గమనార్హం.