Trump-Iran: అణ్వాయుధ తయారీ యత్నాలను అడ్డుకోవడమే లక్ష్యం.. ఇరాన్‌కు ట్రంప్ చెక్
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ అణ్వాయుధాల తయారీకి వేగంగా ప్రయత్నాలు చేస్తుండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వారికి గట్టి ప్రతిస్పందన ఇచ్చారు.
ఆ దేశంపై అత్యధిక ఒత్తిడి తీసుకొచ్చేలా తిరిగి కఠిన విధానాలను అమలు చేయాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
టెహ్రాన్ చమురు ఎగుమతులను పూర్తిగా నిలిపివేసి, ఆ దేశ అణ్వాయుధ తయారీ యత్నాలను అడ్డుకోవడమే తన ప్రధాన లక్ష్యమని ట్రంప్ స్పష్టంగా ప్రకటించారు.
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో సమావేశానికి ముందు ట్రంప్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
తన మొదటి పదవీకాలంలో టెహ్రాన్‌పై అమలు చేసిన కఠిన విధానాన్ని తిరిగి ప్రారంభించే అధ్యక్ష మెమోరాండమ్‌పై ఆయన సంతకం చేశారు.
వివరాలు
ఇరాన్‌తో ఒప్పందానికి నేను సిద్ధంగానే ఉన్నా: ట్రంప్
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, ''ఇరాన్‌తో ఒప్పందానికి నేను సిద్ధంగానే ఉన్నా. కానీ, అణ్వాయుధ ఒప్పందానికి మాత్రం అంగీకరించను. ఆ దేశ నాయకుడితో చర్చలకు సుముఖంగా ఉన్నా, టెహ్రాన్ అణ్వాయుధ తయారీకి ఎంతో దగ్గరగా ఉంది. దీనిని అడ్డుకోవడం అవసరం. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదు'' అని స్పష్టం చేశారు.
ఇరాన్ చమురు ఎగుమతులపై కఠిన ఆంక్షలు విధించడంలో గత బైడెన్ ప్రభుత్వం విఫలమైందని ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు.
బైడెన్ పాలనలో టెహ్రాన్ చమురు విక్రయించి, ఆ డబ్బుతో అణ్వాయుధాల అభివృద్ధికి నిధులు సమకూర్చుకున్నట్లు ఆయన మండిపడ్డారు.
అయితే, తాజా మెమో ద్వారా ఇరాన్‌పై అమలు కానున్న ఆంక్షల వివరాలు పూర్తిగా వెల్లడి కాలేదు.
వివరాలు
న్ను హత్య చేయాలని ప్రయత్నిస్తే..
అదే సమయంలో, ట్రంప్ టెహ్రాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
''నన్ను హత్య చేయాలని ప్రయత్నిస్తే,మీ స్వంత నాశనాన్ని కోరుకున్నట్లే అవుతుంది!నా హత్యకు కుట్ర పన్నితే, ఇరాన్‌ను పూర్తిగా నాశనం చేయాలని నా సలహాదారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాను'' అని స్పష్టం చేశారు.
ట్రంప్ 2020లో తొలిసారి అధికారంలో ఉన్న సమయంలో,అమెరికా దళాలు జరిపిన వైమానిక దాడిలో ఇరాన్ మేజర్ జనరల్ ఖాసీం సులేమానీ మరణించిన సంగతి తెలిసిందే.
ఈ దాడి ట్రంప్ ఆదేశాల మేరకే జరిగిందని అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
ఆ ఘటన అనంతరం,ట్రంప్‌పై దాడులు జరిపేందుకు టెహ్రాన్ కుట్రలు పన్నుతున్నట్లు ఇటీవల కొన్ని నివేదికలు వెల్లడించాయి.
అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్‌పై హత్యాయత్నం వెనుక ఇరాన్ హస్తం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.