Loading...
Pakistan: పాక్‌ చేతికి లక్ష ఎఫ్‌పీవీ డ్రోన్లు.. భారత్‌కు పెరగనున్న ముప్పు?
పాక్‌ చేతికి లక్ష ఎఫ్‌పీవీ డ్రోన్లు.. భారత్‌కు పెరగనున్న ముప్పు?

Pakistan: పాక్‌ చేతికి లక్ష ఎఫ్‌పీవీ డ్రోన్లు.. భారత్‌కు పెరగనున్న ముప్పు?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 16, 2026
10:29 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో భారత క్షిపణి, వైమానిక రక్షణ వ్యవస్థల ధాటికి తీవ్రంగా నష్టపోయిన పాకిస్థాన్‌.. ఇప్పుడు తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా మిత్రదేశమైన తుర్కియేతో భారీ ఆయుధ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. ఏకంగా లక్ష మెర్కుట్‌ ఎఫ్‌పీవీ (ఫస్ట్‌ పర్సన్‌ వ్యూ) డ్రోన్లను కొనుగోలు చేసేందుకు మూడేళ్ల కాలపరిమితితో ఒప్పందంపై సంతకాలు చేసింది. దీంతోపాటు పలు రకాల మానవరహిత సైనిక వ్యవస్థలను కూడా పాకిస్థాన్‌ కొనుగోలు చేయనుంది. ఈ విషయాన్ని ఉలుసఉన్మా, రక్షణ రంగానికి సంబంధించిన బ్లాగులు వెల్లడించాయి.

వివరాలు 

మెర్కుట్‌ ఎఫ్‌పీవీ డ్రోన్లతో 20 మీటర్ల పరిధిలో విధ్వంసం!

ఈ ఒప్పందంలో భాగంగా పాకిస్థాన్‌కు పది ఆల్పైన్‌ మానవరహిత హెలికాప్టర్లు,25 డుమ్‌రుల్‌ మినీ హెలికాప్టర్లు,500 డీఎల్‌ఈ లాయిటరింగ్‌ మ్యూనిషన్‌ వ్యవస్థలు, 250కోర్గాన్‌ గ్రౌండ్‌ వ్యవస్థలు అందనున్నాయి.

అంతేకాకుండా ఈ ఆయుధ వ్యవస్థలను పాకిస్థాన్‌లోనే తయారు చేసేందుకు అవసరమైన ఫ్యాక్టరీలను కూడా ఏర్పాటు చేయనున్నారు.

దీనివల్ల ఆయా డ్రోన్లు,సైనిక వ్యవస్థల తయారీలో పాక్‌కు స్థానికంగా సామర్థ్యం పెరిగే అవకాశం ఉంది.

పాకిస్థాన్‌ కొనుగోలు చేయనున్న మెర్కుట్‌ ఎఫ్‌పీవీ డ్రోన్లు సుమారు 8కిలోమీటర్ల పరిధిలో పనిచేయగలవు.

గరిష్ఠంగా 20 నుంచి 30నిమిషాల పాటు గాల్లో ప్రయాణించగలవు. వీటిలో అమర్చే వార్‌హెడ్‌లో దాదాపు 1,000 వరకు 3మిల్లీమీటర్ల స్టీల్‌ బాల్స్‌ ఉంటాయి.

డ్రోన్‌ పేలినప్పుడు ఇవి చెల్లాచెదురుగా విస్తరించి, సుమారు 20 మీటర్ల పరిధిలో విధ్వంసం సృష్టించగలవు.

వివరాలు 

ఆల్పైన్‌, డుమ్‌రుల్‌ వ్యవస్థలతో పాక్‌ సైనిక బలం పెంపు!

ఇక ఆల్పైన్‌ మానవరహిత హెలికాప్టర్లు దాదాపు 200 కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలవు.

దాడి చేయాల్సిన లక్ష్యానికి సంబంధించిన వివరాలను ముందుగానే ప్రోగ్రామ్‌ చేస్తే.. ఈ వ్యవస్థ స్వయంచాలకంగా పనిచేస్తుంది.

లక్ష్యాలను గుర్తించేందుకు థర్మల్‌ విజన్‌, నైట్‌ విజన్‌ సాంకేతికతలను ఇందులో ఉపయోగించారు.

మరోవైపు డుమ్‌రుల్‌ మినీ హెలికాప్టర్లను తక్కువ దూరంలో నిఘా పెట్టేందుకు, దాడి కార్యకలాపాలకు వినియోగిస్తారు.

ఇవి దాదాపు 120 నిమిషాల పాటు గాల్లో ఉండగలవు. ఇప్పటికే పాకిస్థాన్‌, తుర్కియే కలిసి ఐదో తరం యుద్ధ విమానాలను తయారు చేయాలని నిర్ణయించాయి.

తాజాగా కుదిరిన డ్రోన్ల ఒప్పందం ఇరు దేశాల రక్షణ రంగ సంబంధాలను మరింత బలోపేతం చేసే అవకాశం ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

క్షేత్రస్థాయి యుద్ధాల్లో ఎఫ్‌పీవీ డ్రోన్లదే కీలక పాత్ర!

యుద్ధాల్లో రీపర్‌, బైరక్తర్‌ వంటి డ్రోన్ల పేర్లు తరచూ వినిపిస్తుంటాయి.

అయితే క్షేత్రస్థాయిలో లక్ష్యాలపై దాడులు చేసేందుకు ఎఫ్‌పీవీ డ్రోన్లను సైన్యాలు ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి.

ఎఫ్‌పీవీ అంటే ఫస్ట్‌ పర్సన్‌ వ్యూ. ఈ డ్రోన్ల ముందు భాగంలో కెమెరా అమర్చబడి ఉంటుంది.

అది చిత్రీకరించే దృశ్యాలను ఆపరేటర్‌ ప్రత్యేకంగా రూపొందించిన ఎఫ్‌పీవీ గాగుల్స్‌ లేదా వీఆర్‌ఎక్స్‌ మానిటర్ల ద్వారా చూస్తాడు.

దీంతో అతడు స్వయంగా యుద్ధరంగంలో ఉన్నట్లుగా పరిస్థితులను గమనించగలుగుతాడు. ఆపరేటర్‌ తన చేతిలోని రిమోట్‌ ద్వారా డ్రోన్‌ను నియంత్రిస్తాడు.

కెమెరా ద్వారా కనిపించే దృశ్యాలను పరిశీలిస్తూ లక్ష్యాన్ని గుర్తించి దాడి చేస్తాడు. డ్రోన్‌ మోటార్ల వేగాన్ని మార్చడం ద్వారా దాని కదలికలను నియంత్రించవచ్చు.

ADVERTISEMENT

వివరాలు 

యుద్ధరంగంలోకి వెళ్లకుండానే దూరం నుంచి దాడులు!

సాధారణంగా వీటిలో అధునాతన సెన్సార్లు ఎక్కువగా ఉండవు. ప్రధానంగా ఆపరేటర్‌ నియంత్రణపైనే ఈ డ్రోన్లు ఆధారపడి పనిచేస్తాయి.

ఈ డ్రోన్ల ప్రత్యేకత ఏమిటంటే.. సైనికులు నేరుగా యుద్ధరంగంలోకి వెళ్లాల్సిన అవసరం ఉండదు.

సుమారు 2 నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉండి కూడా వీటిని నియంత్రించవచ్చు.

దీంతో మోర్టార్‌ దాడులు, ప్రత్యర్థి కాల్పుల నుంచి ఆపరేటర్లు సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది.

రహస్య బంకర్‌లో ఉండి యాంటెనాను బయటకు ఏర్పాటు చేస్తే చాలు.. డ్రోన్‌ను దూరం నుంచే నియంత్రించవచ్చు.

ఈ విధానం వల్ల సైనికుల ప్రాణాలకు ముప్పు తగ్గడంతో పాటు లక్ష్యాలపై దాడులు చేయడం సులభమవుతోంది.

వివరాలు 

తక్కువ ఖర్చుతో భారీ విధ్వంసం.. జామింగ్‌ను తట్టుకునే డ్రోన్లు!

ఉక్రెయిన్‌, రష్యా యుద్ధంలో ఈ ఎఫ్‌పీవీ డ్రోన్ల వినియోగం భారీగా పెరిగింది.

సైనికుల కొరత, యుద్ధంలో ప్రాణనష్టాన్ని తగ్గించుకోవడం వంటి కారణాలతో ఇరు దేశాలు వీటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి.

ఒక్కో డ్రోన్‌ ధర 500 అమెరికన్‌ డాలర్ల (సుమారు రూ.47,000) కంటే తక్కువగా ఉంటుందని అంచనా. తక్కువ ఖర్చుతోనే ప్రత్యర్థి సైన్యానికి తీవ్ర నష్టం కలిగించే సామర్థ్యం వీటికి ఉంది.

అంతేకాకుండా వీటి విడిభాగాలు సాధారణ పౌర మార్కెట్లోనూ సులభంగా లభిస్తాయి.

కొన్ని రకాల ఎఫ్‌పీవీ డ్రోన్లలో శత్రు దేశాల ఎలక్ట్రానిక్‌ జామింగ్‌ వ్యవస్థలను ఎదుర్కొనేందుకు అత్యంత పలుచటి వైర్లను కూడా ఉపయోగిస్తున్నారు.

వివరాలు 

డ్రోన్లతోనే భారీగా దాడులు.. యుద్ధ వ్యూహాన్ని మార్చేస్తున్న ఉక్రెయిన్‌!

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంలో ఇప్పటివరకు వినియోగించిన డ్రోన్ల సంఖ్య లక్షల్లో కాకుండా మిలియన్ల స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఉక్రెయిన్‌ ఒక్కటే భారీ సంఖ్యలో డ్రోన్లను తయారు చేస్తోంది.

2025లో తన సైన్యానికి ఏకంగా 30 లక్షల డ్రోన్లను అందించినట్లు సమాచారం.

ప్రస్తుతం ఆ యుద్ధంలో రోజువారీ దాడుల్లో దాదాపు 60 శాతం వరకు డ్రోన్ల ద్వారానే జరుగుతున్నట్లు అంచనాలున్నాయి.

ఒక దశలో ఉక్రెయిన్‌ ఒక్క నెలలోనే 80 వేల దాడులు నిర్వహించిందనే సమాచారం ఈ డ్రోన్ల వినియోగం ఏ స్థాయిలో పెరిగిందో స్పష్టం చేస్తోంది.

తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ మానవరహిత వ్యవస్థలు ఆధునిక యుద్ధాల స్వరూపాన్నే మార్చేస్తున్నాయి.

ADVERTISEMENT