
Pakistan: ఉగ్రవాదానికి మద్దతు విషయంలో నోరు జారిన పాక్ మంత్రి .. అమెరికా కోసమే పెంచి పోషించామంటూ వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
తమ దేశంలో ఉగ్రవాదం లేదంటూ బలంగా అంటున్న పాకిస్థాన్‌కు (Pakistan) ఊహించని దెబ్బ తగిలింది.
అంతవరకు దాచిపెట్టిన నిజాలు పాకిస్థాన్ రక్షణ మంత్రే స్వయంగా బహిర్గతం చేశారు.
తమ దేశం ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చడం,ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడం వంటి చర్యలు చేశారని ఆయన ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగా పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యల ద్వారా పాక్ నేటికీ కొనసాగిస్తున్న మోసపూరిత ధోరణి, దురుద్దేశాలను ప్రపంచానికి రుజువయ్యేలా చేశారు.
ముఖ్యంగా, అమెరికా (USA) కోసమే ఉగ్రవాదులను ప్రోత్సహించామని చెప్పడం గమనార్హం.
వివరాలు
పహల్గాం దాడి తర్వాత పాక్ మంత్రితో ఇంటర్వ్యూ
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.ఈ నేపథ్యంలో పాకిస్థాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) 'స్కై న్యూస్' అనే అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
''పాకిస్థాన్ గతంలో ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చడం,శిక్షణ ఇవ్వడం,మద్దతు ఇచ్చే విధంగా వ్యవహరించిందా?''అని అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ..''మేం మూడున్నర దశాబ్దాల పాటు అమెరికా,బ్రిటన్ సహా పశ్చిమ దేశాల కోసమే ఈ కార్యకలాపాలు చేశాం.ఆ సమయంలో దాని ప్రాముఖ్యత అర్థం కాలేదు.ఇది పాక్‌కు పెద్ద సమస్యగా మారింది.సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో మేం పాల్గొనకుండా ఉండుంటే,ఇప్పటివరకు పాక్ గొప్ప పేరును నిలబెట్టుకునేది'' అని చెప్పారు.
వివరాలు
సరిహద్దుల్లో పాక్ సైనిక చొరబాటు ప్రయత్నాలు
అంతేకాదు, లష్కరే తోయిబా (Lashkar-e-Taiba) గురించి మాట్లాడుతూ.. ''అది ఒక పాత సంస్థ, ఇప్పుడు అది పాకిస్థాన్‌లో ఉనికి కోల్పోయింది'' అని వ్యాఖ్యానించారు.
ఇక మరోవైపు, భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ సైన్యం నియంత్రణ రేఖ వద్ద తమ బలగాల్ని సమీకరిస్తున్నట్లు సమాచారం.
అఫ్గానిస్తాన్ సరిహద్దులతో పాటు బలోచిస్తాన్ ప్రాంతాల్లో ఉన్న సైనికులను కశ్మీర్ సరిహద్దుల్లోకి తరలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అంతేకాదు, ఇప్పటికే సెలవుల్లో ఉన్న సైనికుల సెలవులను రద్దు చేసి, కొత్త సెలవులకు అనుమతి ఇవ్వొద్దని కార్ప్స్ కమాండర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు కూడా తెలుస్తోంది.
వివరాలు
పహల్గాం ఉగ్రదాడి - 26 మంది మృతి
ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు అమానుష దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ దాడి వెనుక 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' (The Resistance Front) అనే సంస్థ హస్తం ఉందని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి.
ఈ సంస్థ పాక్ ఆధారిత లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తోంది. ఇప్పటికే భారత ప్రభుత్వం ఈ సంస్థను ఉగ్రవాద సంస్థగా గుర్తించింది.