దినదిన గండంగా పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి.. మరో ప్యాకేజీ అవసరమన్న ఐఎంఎఫ్ నివేదిక
దాయాది పాకిస్థాన్ దేశాన్ని తీవ్రమైన ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. ఓ వైపు ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ) నుంచి భారీ స్థాయిలో ప్యాకేజీలు మంజూరయ్యాయి. అయినా నిధులకు ఇప్పటికీ కటకటే . రానున్న ఎన్నికలు నేపథ్యంలో పాకిస్థాన్‌కు మరోసారి ఆర్థిక సాయం చేయాల్సిన స్థితి ఏర్పడొచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి వెల్లడించింది. ఇప్పటికే అంగీకరించిన భారీ ప్యాకేజీకి ఇది అదనం కానుంది. ఈ మేరకు మంగళవారం ఈ ప్రపంచ స్థాయి సంస్థ ఓ నివేదిక కూడా విడుదల చేసినట్లు పాక్ కు చెందిన డాన్ పత్రిక వివరించింది. ఆర్థిక కష్టాల నుంచి గట్టేక్కేందుకు ఇస్లామాబాద్ విమానాశ్రయాన్ని ఔట్ సోర్సింగ్‌కు ఇచ్చేసింది. కరాచీ, లాహోర్ ఎయిర్ పోర్ట్ భూములను లీజుకివ్వాలని ఆలోచిస్తోంది.
పాక్ కు మరో ఒప్పందం అవసరమున్నట్లు ఉంది : ఐఎంఎఫ్
ఇప్పటికే అంగీకరించిన ప్యాకేజీ కాకుండా కూడా నిరంతర సర్దుబాట్లు చేసే ఆవశ్యకత ఏర్పడుతోందని 120 పేజీల నివేదిక ద్వారా బహిర్గతం చేసింది. మరోవైపు పాక్ ఆర్థిక శాఖ మంత్రి ఇషాక్ దార్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ గవర్నర్ జమీల్ అహ్మద్ సంతకాలతో కూడిన ఆర్థిక, ద్రవ్య విధానాల ఒప్పందాన్ని తాజా నివేదిక విడుదల చేసింది. పాక్ ఆర్థిక సమస్యలు తీవ్రంగా, కష్టతరంగా ఉన్నాయని, దీంతో దేశానికి తీవ్ర ముప్పు ఉందని నివేదిక తెలిపింది. కొంతకాలం చెల్లింపుల సామర్థ్యాన్ని పెంచుకునేందుకు పాక్ కు మరో ఒప్పందం అవసరమున్నట్లు సదరు నివేదికలో పొందుపర్చింది. ఓవైపు ఇప్పటికే అంగీకరించిన ఒప్పందాలకు నిబంధనలు అనుసరించడం, మరోవైపు బయటి నుంచి రుణదాతలను పొందడం కీలక పాత్ర పోషిస్తాయని వివరించింది.