పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ రద్దు.. ప్రధాని షరీఫ్ సూచనతో అధ్యక్షుడు అరీఫ్ నిర్ణయం
పాకిస్తాన్ 15వ నేషనల్ అసెంబ్లీ రద్దు అయ్యింది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ సూచనల మేరకు ఆ దేశ అధ్యక్షుడు అరీఫ్ అల్వీ సభను రద్దు చేశారు. 3 నెలల్లో పాక్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. జాతీయ అసెంబ్లీలో చట్టసభ్యుల మద్దతుతో ఈ విషయం ప్రకటించాలని భావిస్తున్నట్లు అధ్యక్షుడు అరీఫ్ తో ప్రధాని చెప్పారు. దీంతో బుధవారం రాత్రి పాక్ జాతీయ అసెంబ్లీని అధ్యక్షుడు రద్దు చేశారు. ఈ నేపథ్యంలోనే త్వరలో పాకిస్తాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. మరికొద్ది నెలల్లోనే 16వ పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ కొలువుదీరనుంది.
అసెంబ్లీలో చివరిసారిగా ప్రసంగించిన పాక్ ప్రధాని షరీఫ్
నేషనల్ అసెంబ్లీ రద్దు కావడంతో మూడు రోజుల ముందుగానే సంకీర్ణ ప్రభుత్వం రద్దయింది. ఈ మేరకు బుధవారం అసెంబ్లీలో షరీఫ్ చివరిసారిగా ప్రసంగించారు. పాక్ లో సర్కారు పదవీ కాలం పూర్తయ్యాక రెండు నెలల్లోగా ఎన్నికలు నిర్వహిస్తారు. ఈసారి ముందస్తుగానే అసెంబ్లీ రద్దు జరిగిన నేపథ్యంలో ఎన్నికలకు 90 రోజుల సమయం ఉండటం గమనార్హం. మరోవైపు పాకిస్తాన్‌లో కొత్తగా చేపట్టిన జనాభా గణన ఫలితాలు వెల్లడయ్యాయి. డెమోగ్రఫీలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. జనాభా అంశం మేరకు పాక్ లో నియోజకవర్గాల పునర్విభజన(DELIMITATION) జరగాల్సి ఉంది. రానున్న 3 నెలల్లోనే పునర్విభజన పనులు పూర్తి చేసుకుని ఎన్నికలు నిర్వహించడం ఆ దేశ ఎన్నికల సంఘానికి కత్తిమీద సాము మాదిరి కానుంది.