
ACUTE FOOD INSECURITY IN PAKISTAN: ఆహార సంక్షోభంలో పాక్.. 11మిలియన్ల మంది ఆకలితో అలమటించే ప్రమాదం: FAO
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) తాజా నివేదికలో వెల్లడించింది.
ఈ సంక్షోభం కారణంగా 11 మిలియన్ల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.
2024 నవంబర్ నుండి 2025 మార్చి వరకూ పాకిస్థాన్‌లో ఆహార కొరత తీవ్రంగా కొనసాగినట్లు వెల్లడించింది.
వివరాలు
ఎఫ్ఏఓ తాజా నివేదిక ప్రకారం:
ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభ పరిస్థితులపై FAO శుక్రవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం, బలూచిస్థాన్,సింధ్,ఖైబర్ పఖ్తుంఖ్వా వంటి వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో ప్రజలు ఆహార లోపంతో బాధపడుతున్నారని తెలిపింది.
దాదాపు 11మిలియన్ల మంది లేదా పాకిస్థాన్ మొత్తం జనాభాలో సుమారు 22శాతం మంది తీవ్ర స్థాయిలో ఆహార కొరతను ఎదుర్కొంటున్నారని అంచనా వేసింది.
వీరిలో 1.7మిలియన్ల మంది అత్యవసర సహాయానికి అర్హులుగా ఉన్నట్లు పేర్కొంది.
2024లో నమోదైన గరిష్ఠ స్థాయి ఆహార కొరతతో పోల్చితే, 2025లో ఇది మరో 38శాతం మేర పెరిగే అవకాశం ఉందని సూచించింది.
గత సంవత్సరం కంటే కొంత మేరకు ఆహార లోపం తగ్గినప్పటికీ,వాతావరణ పరిస్థితులు ప్రజల జీవనోపాధిపై ప్రభావం చూపుతాయని నివేదిక స్పష్టం చేసింది.
వివరాలు
తీవ్రమైన పోషకాహార లోపం స్పష్టంగా కనిపిస్తోంది
2023 నవంబర్ నుంచి 2024 జనవరి మధ్యకాలంలో దాదాపు 11.8 మిలియన్ల మంది తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొన్నట్టు నివేదిక తెలిపింది.
2023లో జరిగిన పరిస్థితులే 2024లోనూ కొనసాగాయని పేర్కొంది. ముఖ్యంగా బలూచిస్థాన్, సింధ్ ప్రాంతాల్లో 2018 నుండి 2024 ప్రారంభం వరకూ ప్రజలు తీవ్ర స్థాయిలో పోషకాహార లోపాన్ని అనుభవించారని వివరించింది.
2025లో వాతావరణ మార్పులు, కొనసాగుతున్న ఆహార సంక్షోభం కారణంగా ఈ పోషకాహార లోపం మరింత అధికమయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.
వివరాలు
భారీగా ప్రభావితమవుతున్న జిల్లాలు
శీతాకాలంలో బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా, సింధ్ రాష్ట్రాల్లోని 43 గ్రామీణ జిల్లాల్లో దాదాపు 11.8 మిలియన్ల మంది తీవ్రమైన ఆహార లోపంతో బాధపడుతున్నారు.
వీరిలో 2.2 మిలియన్ల మంది 2023 నవంబర్ నుండి 2024 జనవరి మధ్యకాలంలో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ ఇన్‌సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్ ప్రకారం అత్యవసర పరిస్థితుల్లో ఉన్నారు.
2023 మార్చి నుండి 2024 జనవరి మధ్య 6 నెలల నుండి 59 నెలల వయస్సు కలిగిన సుమారు 2.1 మిలియన్ల మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని నివేదిక వివరించింది.
వివరాలు
స్త్రీలు, శిశువులపై తీవ్ర ప్రభావం
గర్భిణీలు, పాలిచ్చే బాలింతలలో పోషకాహార లోపం తీవ్రంగా కనిపిస్తున్నదని నివేదిక పేర్కొంది.
సింధ్, ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రాల్లో చాలా మంది శిశువులు తక్కువ బరువుతో జన్మిస్తున్నారని స్పష్టం చేసింది.
శీతాకాలంలో ఈ ప్రాంతాల్లో విరేచనాలు, తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, మలేరియాతో ప్రజలు తీవ్రంగా బాధపడుతున్నారని తెలియజేసింది.
ఈ పరిస్థితులకు ప్రధాన కారణాలుగా పారిశుద్ధ్య సౌకర్యాల లేమి, శుద్ధమైన తాగునీరు అందుబాటులో లేకపోవడమని FAO నివేదిక లో తెలిపింది.
ఈ అంశాలు ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రమైన స్థాయిలో ప్రభావితం చేస్తున్నాయని స్పష్టం చేసింది.