
India-Pakistan: భారత నౌకలపై నిషేధం విధించిన పాక్.. ప్రతీకార చర్యల ప్రారంభం?
ఈ వార్తాకథనం ఏంటి
ఉగ్రవాదానికి తలదాల్చే దేశంగా పాకిస్థాన్‌పై భారతదేశం మరింత కఠినంగా వ్యవహరించింది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాక్ నుంచి వస్తున్న దిగుమతులపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రతీకారంగా పాకిస్థాన్ భారత్‌పై ఆంక్షలు విధించేందుకు రెడీ అయింది. భారత జెండా ఉన్న నౌకలు తమ నౌకాశ్రయాలను వినియోగించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది.
అంతేకాదు భారత్ నుంచి దిగుమతి చేసుకునే కొన్ని ఉత్పత్తులపై కూడా నిషేధం విధించింది. అదే విధంగా పాక్ జెండాతో ఉన్న నౌకలు భారత్‌లోని పోర్టులకు రాకూడదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.
Details
పాకిస్థాన్ నుంచి రవాణా అయ్యే అన్ని రకాల ఉత్పత్తులపై నిషేధం
ఈమేరకు వాణిజ్య మంత్రిత్వ శాఖ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పాకిస్థాన్ నుంచి రవాణా అయ్యే అన్ని రకాల ఉత్పత్తులపై నిషేధం అమలులోకి వస్తుందని తెలిపింది.
1958 మర్చెంట్ షిప్పింగ్ చట్టంలోని 411 సెక్షన్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా భారత నౌకలు కూడా పాకిస్థాన్ పోర్టులకు వెళ్లకూడదని స్పష్టం చేసింది.
ఇప్పటికే పాక్ విమానాల కోసం మన గగనతలాన్ని మూసివేసిన భారత్, ఇప్పుడు తపాలా శాఖ ద్వారా రాకపోకలు కూడా నిలిపివేసింది.
పాకిస్థాన్ నుంచి వస్తున్న ఉత్తరాలు, పార్సిళ్ల రవాణాను పూర్తిగా నిలిపివేయాలని స్పష్టం చేసింది.
Details
పరిశ్రమలకు గట్టి ఎదురుదెబ్బ
గతంలో 2019లో పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ దిగుమతులపై 200 శాతం దిగుమతి సుంకం విధించింది. అప్పటినుంచి ఆ దిగుమతులు తగ్గిపోయాయి.
తాజాగా పహల్గాం ఉగ్రదాడి, సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలు పెరగడంతో కేంద్రం మరింత కఠినంగా వ్యవహరించేందుకు ఈ చర్యలు తీసుకుంది.
ఇతర దేశాల గుండా పాక్ వస్తువులు భారత్‌కు చేరకుండా ఈ ఆంక్షలు ప్రభావవంతంగా అమలవుతాయి. ఫలితంగా పాక్ ఎగుమతులపై ఆధారపడే పరిశ్రమలకు భారీ దెబ్బ తగలనుంది.