
Pakistan: ఖరీఫ్ సీజన్ నుంచే పాకిస్తాన్ 21% నీటి కొరతను ఎదుర్కొనే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశం సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో,దాని ప్రభావం ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ నుంచే పాకిస్థాన్‌పై కనిపించబోతోందని ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ (ISRA)అంచనా వేసింది.
దేశానికి వచ్చే నీటిలో సుమారు 21 శాతం మేర కోత ఏర్పడే అవకాశం ఉందని ISRA పేర్కొంది.
ముఖ్యంగా చీనాబ్ నదిలో నీటి లభ్యత తగ్గుతుండటం ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా నిలుస్తుందని తెలిపింది.
ఇప్పటికే సలాల్,బగ్‌లిహార్ డ్యామ్‌ల గేట్లు మూసివేయడంతో, పాకిస్తాన్ వైపు వెళ్లే నీటి ప్రవాహం గణనీయంగా తగ్గిపోయింది.
మరాల ప్రాంతంలో ఇప్పటికే నీటి కొరత స్పష్టంగా కనిపిస్తోంది.ఈపరిణామం ఖరీఫ్ వ్యవసాయ సీజన్‌పై ప్రభావం చూపించనుందని అధికారులు భావిస్తున్నారు.
కిషన్ గంగా నదిపై కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాలని భారత్ యోచిస్తోంది.
వివరాలు
ఖరీఫ్ ప్రారంభంలో పాకిస్తాన్ 21 శాతం తక్కువ నీటిని అందుకుంటుందని అంచనా
మే నుంచి సెప్టెంబర్ వరకు జరిగే ఖరీఫ్ సీజన్‌లో నీటి అందుబాటును అంచనా వేసేందుకు ISRA సమావేశమైంది.
''మే మొదటి వారంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో, తర్వాతి కాలంలో నీటి లభ్యతపై సమీక్షలు కొనసాగుతాయి. భారత్ నిర్ణయంతో మరాల వద్ద చీనాబ్ నదిలో నీటి లభ్యత తగ్గిన పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.ఇది ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో మరింత నీటి కొరతకు దారి తీసే అవకాశం ఉంది'' అని ISRA స్పష్టం చేసింది.
చీనాబ్,రావి నదులలో సాధారణ స్థాయిలో ప్రవాహం కొనసాగితేనైనా ఖరీఫ్ ప్రారంభంలో పాకిస్తాన్ 21 శాతం తక్కువ నీటిని అందుకుంటుందని అంచనా వేసింది.
అలాగే రోజువారీగా సమీక్షలు నిర్వహించి,చీనాబ్‌లో నీటి ప్రవాహం మరింత తగ్గితే,తాము చేసిన అంచనాలను సవరిస్తామని ISRA పేర్కొంది.
వివరాలు
నది మధ్యలోకి వెళ్ళి ఫోటోలు దిగుతున్న పర్యాటకులు
చీనాబ్ నదిలో అక్నూర్ ప్రాంతంలో నీటి ప్రవాహం గణనీయంగా తగ్గిపోయింది.
ఈ స్థితిని చూస్తే పర్యాటకులు నది మధ్యలోకి వెళ్ళి సులభంగా ఫోటోలు దిగుతున్న పరిస్థితి ఏర్పడింది.
ఈ నీటి తగ్గుదలకు ప్రధాన కారణం సలాల్, బగ్‌లిహార్ డ్యామ్‌ల మూసివేతే అని స్పష్టమవుతోంది.
ఏప్రిల్ 22న పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత, భారత్ పాకిస్తాన్‌పై కఠినమైన చర్యలు ప్రారంభించింది.
ఇందులో భాగంగా సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడమే కాకుండా, పాక్‌తో వాణిజ్యం, రాకపోకలను నిలిపివేసింది.
అంతేకాకుండా, దేశ గగనతలాన్ని కూడా మూసివేసింది. ఈ చర్యలతో పాటు త్రివిధ దళాలను ఏ పరిస్థితినైనా ఎదుర్కొనగలుగుతున్నట్లుగా సిద్ధం చేస్తూ ఏర్పాట్లు చేపట్టింది.