
Pakistan: పాక్ సంచలన నిర్ణయం.. భారత విమానాలకు గగనతల నిషేధం పొడిగింపు
ఈ వార్తాకథనం ఏంటి
దాయాది దేశమైన పాకిస్థాన్ భారతీయ విమానాలపై విధించిన గగనతల నిషేధాన్ని మరోసారి పొడిగించింది. ఇప్పటికే అమలులో ఉన్న ఈ నిషేధాన్ని తాజాగా పాకిస్థాన్ అధికారికంగా ఆగస్టు 24 వరకు విస్తరించింది. ఇది ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి స్పందనగా ఏర్పడిన పరిణామాల్లో భాగం. ఆ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం భారత్ కఠిన వైఖరి అవలంబించింది. సింధు నదీ జలాల పంపిణీని నిలిపివేయడమే కాదు, అటారీ సరిహద్దు వాణిజ్య మార్గాన్నీ మూసేసింది. దీనికి ప్రతిస్పందనగా పాకిస్థాన్ తన గగనతలాన్ని భారతీయ విమానాలకు మూసేసింది.
Details
పాకిస్థాన్ గగనతలం అందుబాటులో ఉండదు
ఇప్పుడు ఈ నిషేధాన్ని ఆగస్టు 24 ఉదయం 5:19 గంటల వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఆంక్షలు జూలై 19 మధ్యాహ్నం 3:50 గంటల నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. పాకిస్థాన్ విమానాశ్రయాల అథారిటీ (PAA) ప్రకారం, ఈ నిషేధం భారతీయ విమానయాన సంస్థలు నడిపే ప్రయాణికుల విమానాలు, సరుకు రవాణా విమానాలు, లీజుకు తీసుకున్న సైనిక, పౌర విమానాలు అన్నింటిపైనా వర్తించనుంది. అంటే భారత ప్రభుత్వ యాజమాన్యంలోని ఏ ఒక్క విమానానికి కూడా పాకిస్థాన్ గగనతలం అందుబాటులో ఉండదు.
Details
ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు
ఇక భారత్ కూడా మే 7న 'ఆపరేషన్ సిందూర్' చేపట్టింది. ఈ సర్జికల్ స్ట్రైక్‌లో 100మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు సమాచారం. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలుస్తోంది. ఈ చర్యలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. దాంతో గగనతలాన్ని పరస్పరం మూసేసుకునే దిశగా ఇరు దేశాలు సాగాయి. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్-పాకిస్థాన్ గగనతల సమస్య విమానయాన రంగంతో పాటు అంతర్జాతీయ వాణిజ్యానికి, భద్రతకు కూడా సవాల్‌గా మారింది.