
USA: భారత్‌పై మళ్లీ నోరు పారేసుకున్న పీటర్ నవారో.. రష్యా సంబంధాలపై తీవ్ర విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో భారత్‌ను లక్ష్యంగా చేసుకొని మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలోని కొన్ని వర్గాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతూ, భారత్‌పై ఆరోపణలు గుప్పించారు.'క్రెమ్లిన్‌కు భారత్ లాండ్రోమ్యాట్‌లా పనిచేస్తోంది. ఒక వర్గం లబ్ధి పొందేందుకు భారత ప్రజలను పణంగా పెడుతోంది.దీన్ని మనం అడ్డుకోవాలి. ఇది ఉక్రెయిన్ ప్రజల ప్రాణాలను తీస్తోంది. మనం అమెరికన్లుగా పన్ను చెల్లింపుదారుల డబ్బుతో ఏం చేయాలో అది చేయాలని ఆయన అన్నారు. మాస్కో, బీజింగ్‌లతో న్యూదిల్లీ సంబంధాలు ప్రపంచ స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. 'అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకుడైన మోదీ గొప్ప నాయకుడు. కానీ, ఆయన పుతిన్, జిన్‌పింగ్‌లతో ఎందుకు దగ్గర అవుతున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.
Details
భారత్ చమురు దిగుమతులపై ఆరోపణలు
రష్యా నుంచి ఎక్కువగా చమురు కొనుగోలు చేసే దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలైన ఐవోసీ, బీపీసీఎల్ ఎక్కువ చమురు దిగుమతులు చేస్తుండగా, వాటి తర్వాత రిలయన్స్, నయారా ఎనర్జీ ఉన్నాయి. 150 కోట్ల జనాభాకు చౌక ఇంధనం అవసరమని భారత ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అయితే 2024 ట్రేడింగ్ ఎకనామిక్స్ గణాంకాల ప్రకారం అమెరికానే రష్యా నుంచి 3.27 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. అందులో 1.3 బిలియన్ డాలర్లు ఇంధన దిగుమతులకే ఖర్చు చేసింది. భారత్‌పై ఆరోపణలు చేస్తున్న నవారో ఈ విషయంపై మాత్రం మౌనం వహిస్తున్నారు.
Details
టారిఫ్‌లపై నవారో స్పందన
అమెరికా ఫెడరల్ కోర్టు, ట్రంప్ విధించిన పన్నులు (US Tariffs) శాశ్వతం కావని స్పష్టం చేసింది. దీనిపై నవారో స్పందిస్తూ, ''మేము ఎప్పుడూ ఆ టారిఫ్‌లు శాశ్వతమని చెప్పలేదు. కావాలంటే మీరు బెసెంట్, లుట్నిక్, గ్రీర్, అధ్యక్షుడి ప్రకటనలు చూడండి'' అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
Details
ట్రంప్ సుంకాలపై కోర్టు తీర్పు
అమెరికా ఫెడరల్ అప్పీల్ కోర్టు తీర్పు ప్రకారం, ట్రంప్ విధించిన అధిక సుంకాలు (Tariffs) చట్ట విరుద్ధమని తేలింది. అధ్యక్షుడు తన ఆర్థిక అధికారాలను దాటి అధికంగా టారిఫ్‌లను పెంచారని కోర్టు పేర్కొంది. 7-4 తేడాతో న్యాయమూర్తులు ఈ తీర్పు వెలువరించారు. భారీ సుంకాల కారణంగా పలు దేశాలు నష్టపోయాయని కోర్టు తెలిపింది. అయితే పెంచిన టారిఫ్‌లను తాత్కాలికంగా అక్టోబర్ మధ్య వరకు కొనసాగించేందుకు అనుమతినిచ్చింది. దీంతో, ఈ నిర్ణయాన్ని యూఎస్ సుప్రీంకోర్టులో సవాలు చేసుకునే అవకాశం ట్రంప్‌కు లభించింది. కోర్టు తీర్పుపై ఆయన సుప్రీంకోర్టులో పోరాడనున్నారు.