Indonesia: ఇండోనేషియాలో రన్‌వేపై అదుపుతప్పిన విమానం..48 మందికి గాయాలు
ఇండోనేషియాలోని పపువా ప్రాంతంలోని యాపిన్ ద్వీపంలో 48 మందితో టేకాఫ్ అవుతున్న ఏటీఆర్-42 విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. విమానం రన్‌వేపై అదుపు తప్పి సమీపంలోని చెట్లల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. త్రిగన ఎయిర్‌కు చెందిన ఈ విమానం సోమవారం ఉదయం జయపురకు బయలుదేరగా ఈ ప్రమాదం జరిగింది. విమాన ప్రమాదం సమయంలో విమానంలో ఓ పాపతో సహా 42 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. గాయపడిన ప్రయాణికులను ఆసుపత్రికి తరలించామని, ఘటనపై దర్యాప్తు జరుగుతోందని పోలీసు అధికారి ఆర్ద్యాన్ యూకీ తెలిపారు.
మరో విమానం కూలిపోవడంతో 54 మంది మరణించారు
ఇండోనేసియాకు ఆసియాలోనే అత్యంత చెత్త విమానయాన రికార్డు ఉంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రకృతి విపత్తులతో ప్రతి ఏటా ప్రమాదాలు జరుగుతున్నాయి,అనేక ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. 1945 నుండి ఇప్పటి వరకు 100కు పైగా ప్రమాదాలు జరిగినట్లు,1300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు ఏవియేషన్ సేఫ్టీ నెట్‌వర్క్ డేటా చెబుతోంది. ఆసియాలో ఇది అత్యంత ప్రమాదకరమైన విమానయాన రికార్డు.అగ్నిపర్వతాలు బద్దలై బూడిద వ్యాపించడం,ఇతర భౌగోళిక పరిస్థితుల కారణంగా తరచూ విమాన ప్రయాణాలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. 1990లలో ఇండోనేసియా,కొంతకాలం నియంతృత్వ పరిపాలన తర్వాత,ఆర్థిక వ్యవస్థను పెట్టుబడుల కోసం తెరిచింది. ఆ సమయంలో నియమాలు పట్టించుకోకుండా భారీగా పెట్టుబడులు వచ్చాయి.భద్రతా ఏర్పాట్లలో లోపాలు ఉన్నాయి.2015లో త్రిగన ఎయిర్‌కు చెందిన మరో విమానం కూలిపోవడంతో 54 మంది మరణించారు.