PM Modi: మారిషస్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
వచ్చే నెలలో జరగనున్న మారిషస్ 57వ స్వాతంత్య్ర దినోత్సవానికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గౌరవ అతిథిగా హాజరవుతారని మారిషస్ ప్రధాని నవీన్ రామ్‌గూలమ్ అధికారికంగా ప్రకటించారు.
ఈ వేడుక ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన దౌత్య సంబంధాలకు మరోసారి నిదర్శనంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గాంచిన నాయకుల్లో మోదీ ఒకరని, తన బిజీ షెడ్యూల్ మధ్య తమ ఆహ్వానాన్ని స్వీకరించడం మారిషస్‌కు ఎంతో గౌరవంగా భావిస్తున్నామని నవీన్ రామ్‌గూలమ్ వ్యాఖ్యానించారు.
Details
గతేడాది ద్రౌపది ముర్ము హాజరు
1968 మార్చి 12న బ్రిటిష్ పాలన నుంచి స్వేచ్ఛ పొందిన మారిషస్ ప్రతి ఏడాది మార్చి 12ను జాతీయ దినోత్సవంగా జరుపుకుంటోంది.
గతేడాది ఈ వేడుకలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా యూనివర్సిటీ ఆఫ్ మారిషస్ ఆమెకు గౌరవ డాక్టర్ ఆఫ్ సివిల్ లా పట్టాను ప్రదానం చేసింది.
ఈసారి స్వాతంత్ర్య దినోత్సవం మరింత ప్రత్యేకంగా జరగనుండగా, భారత ప్రధానమంత్రి మోదీ హాజరవడం వేడుకకు మరింత విశిష్టతను తీసుకురానుందని మారిషస్ ప్రభుత్వం పేర్కొంది.