
PM Modi : నమీబియా పర్యటన ముగించుకుని స్వదేశానికి బయలుదేరిన ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ ఎనిమిదిరోజులలో ఐదు దేశాల సుదీర్ఘ విదేశీ పర్యటనను విజయవంతంగా పూర్తిచేశారు. ఈ టూర్‌లో ఆయన ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాలను సందర్శించారు. పలు కీలక ఒప్పందాలకు ఆయన ఈ పర్యటనలో సంతకాలు చేశారు. చివరగా నమీబియా పర్యటనతో ఈ విదేశీ యాత్ర ముగిసింది. తదుపరి ఆయన ఢిల్లీకి బయలుదేరారు. బ్రెజిల్‌లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న తర్వాత మోదీ మిగిలిన దేశాలు పర్యటించారు. నమీబియా ప్రభుత్వం మోదీకి దేశంలోని అత్యున్నత పౌర పురస్కారమైన 'వెల్‌విచ్చియా మిరాబిలి'ను ప్రదానం చేసింది. ఇది మోదీకి లభించిన 27వ అంతర్జాతీయ అవార్డు కావడం విశేషం.
వివరాలు
నెతుంబోతో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు
ఈ అవార్డు తన వ్యక్తిగతంగా కాకుండా 140 కోట్ల మంది భారతీయుల తరఫున స్వీకరిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు. భారత్-నమీబియా మధ్య ఎప్పటికీ నిలిచే గాఢమైన అనుబంధం ఉందని, ఈ రోజు నమీబియాలోని ప్రజలను కలవడం ఎంతో సంతోషకరమని అన్నారు. అలాగే, ఈ పురస్కారాన్ని రెండు దేశాల ప్రజలకు అంకితమిస్తున్నట్టు తెలిపారు. బ్రెజిల్ పర్యటన అనంతరం నమీబియాలో అడుగుపెట్టిన ప్రధానికి అక్కడ ఘన స్వాగతం లభించింది. సంప్రదాయ సంగీతం, నృత్యాలతో నమీబియా సాంస్కృతిక బృందాలు ఆయనకు స్వాగతం పలికాయి. డోలు మోగుతూ సంబరాలను కొనసాగించగా, మోదీ వారిని ఉత్సాహపరిచారు. నమీబియా అధ్యక్షుడు నెతుంబోతో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. అలాగే నమీబియా తొలి అధ్యక్షుడు, మరణించిన డాక్టర్ సామ్ నుజోమా స్మారక స్థూపానికి నివాళులర్పించారు.
వివరాలు
ఆఫ్రికా ఖండాన్ని భారత్ అత్యంత ప్రాధాన్యతగా చూస్తుంది : మోదీ
అనంతరం నమీబియా పార్లమెంట్‌కు వెళ్లిన ప్రధాని మోదీ, అక్కడి పార్లమెంటు సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆఫ్రికా ఖండాన్ని భారత్ అత్యంత ప్రాధాన్యతగా చూస్తుందని చెప్పారు. అధికారం లేదా ఆధిపత్యానికి కాకుండా, సమానత్వం,భాగస్వామ్యంతో అభివృద్ధి చెందే ప్రపంచ భవిష్యత్తు కోసం ఇరు దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఆఫ్రికా ఖండం కేవలం ముడిసరకుల నిలయంగా కాకుండా, సుస్థిర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. భారతదేశం-నమీబియా మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక బంధాలను మోదీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు.
వివరాలు
నమీబియా పార్లమెంటులో లేచి నిలబడి చపట్లు
మోదీ ప్రసంగం ముగిసిన అనంతరం, నమీబియా పార్లమెంటు సభ్యులు గౌరవ సూచకంగా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఈ సంఘటన ప్రధాని పర్యటనకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నమీబియా పర్యటనతో ప్రధాని మోదీ విదేశీ యాత్ర పూర్తయ్యింది. ఆపై ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు.