మరో వివాదంలో ట్రూడో.. పార్లమెంట్ సాక్షిగా నాజీలపై ప్రేమ కురిపించిన కెనడా ప్రధాని
కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ మేరకు హిట్లర్‌తో కలిసి పోరాడిన నాజీ డివిజన్ సైనికుడ్ని పార్లమెంట్ వేదికగా గౌరవించడం కలకలం రేపింది. రష్యాతో యుద్ధం తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తొలిసారిగా కెనడాలో అడుగుపెట్టారు.ఈ సందర్భంగా శుక్రవారం ఆయన పార్లమెంట్‌కు వచ్చారు.మరోవైపు నాజీ మాజీ సైనికుడు యారోస్లోవ్ హంకాను ఆ దేశ స్పీకర్ ఆహ్వానించారు. పార్లమెంట్‌లో జెలెన్‌స్కీ ప్రసంగం అనంతరం స్పీకర్ రోటా స్వయంగా హంకాను పరిచయం చేస్తూ రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా నుంచి ఉక్రెయిన్‌కు స్వేచ్ఛను అందించేందుకు పోరాటం చేసిన యోధుడిగా ప్రశంసించారు. సభలో ఉన్న ప్రధాని ట్రూడో,జలెన్‌స్కీ సహా చప్పట్లు కొడుతూ లేచి నిలబడిన క్రమంలో జెలెన్‌స్కీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
అసలు విషయం తెలిసి పశ్చాత్తాపం వ్యక్తం చేసిన కెనడా స్పీకర్
ఇక్కడే అసలు విషయం తెలిసింది. కెనడాలోని 'ది ఫ్రెండ్స్ ఆఫ్ సైమన్ వెసింతల్ సెంటర్' ప్రతినిధులు పార్లమెంటులో జరిగిన చర్యను తప్పుబట్టారు. పార్లమెంట్ గౌరవించిన హంకా, రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ పక్షాన పోరాటం చేసిన 14వ వాఫన్ గ్రనేడియర్ డివిజన్'కు చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు. అయితే అతడి గత చరిత్ర తెలుసుకోకుండానే పార్లమెంటుకు పిలిపించి, గౌరవించారు.అంతా అయిపోయాక విషయం తెలిసిన కెనడా సర్కారు, బహిరంగ క్షమాపణలు కోరింది. ఈ నేపథ్యంలోనే కెనడా హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ ఆంటోని రోటా యూదులకు క్షమాపణలు చెప్పారు.దీనిపై స్పందించిన కెనడా ప్రతిపక్ష పార్టీలు, ప్రధాని ట్రూడో తీరుపై భగ్గుమంటున్నాయి. అతడి గురించి తనకు పూర్తిగా తెలియదని, తన నిర్ణయానికి పశ్చాత్తాపం చెందుతున్నట్లు రోటా తెలిపారు.