US elections: అమెరికాలో ఎన్నికల హడావుడి.. ముందస్తు ఓటింగ్‌లో కొత్త ఓటింగ్
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ముందస్తు ఓటింగ్ ప్రక్రియ ఊపందుకుంది. ఇప్పటి వరకు 6.1 కోట్ల మంది అమెరికన్ ఓటర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ నుంచి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్‌లు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ముందస్తు ఓటింగ్‌లో కొన్ని లక్షల మంది పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగిస్తుండగా, మరికొందరు మెయిల్ ద్వారా ఓటేశారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా తన ఓటును డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో ఓటు వేశారు. ఆయన తన ఇంటి సమీపంలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లి, దాదాపు 40 నిమిషాల పాటు క్యూలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకోవడం గమనార్హం.
హారిస్, ట్రంప్‌ల మధ్య గట్టి పోటీ
అగ్రరాజ్యంలో నవంబర్ 5న జరిగే ఈ ఎన్నికల్లో సర్వేలు హారిస్‌కు కాస్త ముందస్తున్నట్లు సూచిస్తున్నాయి. అయితే, ముఖ్య రాష్ట్రాలైన జార్జియా, నార్త్ కరోలినాలో హారిస్, ట్రంప్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది. తాజా సర్వే ప్రకారం, జార్జియాలో ట్రంప్‌కు 48 శాతం, హారిస్‌కు 47 శాతం మద్దతు ఉంది. ఇక, నార్త్ కరోలినాలో హారిస్‌కు 48 శాతం, ట్రంప్‌కు 47 శాతం మద్దతు లభించింది. 2008లో డెమోక్రటిక్ అభ్యర్థి ఒబామాకు మద్దతు తెలిపిన నార్త్ కరోలినా, ఆ తరువాత రిపబ్లికన్ అభ్యర్థుల వైపు మొగ్గుచూపుతోంది. జార్జియాలోనూ గత ఎన్నికలలో గట్టి పోటీ ఉండగా, చివరకు 2020లో బైడెన్ కేవలం 1 శాతం మెజారిటీతో గెలిచిన విషయం గమనార్హం.