రష్యా వాహన తయారీదారులకు పుతిన్ మేక్ ఇన్ ఇండియా ఉదాహరణ
మిలిటరీ ఆపరేషన్ కారణంగా G20 సమ్మిట్‌కు దూరంగా ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రోత్సహించడంలో సరైన పని చేస్తున్నారని అన్నారు. 8వ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్ (ఈఈఎఫ్)లో రష్యా తయారీ కార్లపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశీయంగా తయారైన ఆటోమొబైల్స్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలనే దాని విధానాల ద్వారా భారతదేశం ఒక ఉదాహరణగా నిలిచిందని ఆయన అన్నారు.
భారతదేశం నుండి రష్యా చాలా నేర్చుకోవాలి: పుతిన్
ఒకప్పుడు రష్యా వద్ద దేశీయంగా ఉత్పత్తి చేయబడిన కార్లు లేవు, కానీ ఇప్పుడు అవి తమ వద్ద ఉన్నాయన్నారు. 1990లలో తాము పెద్దఎత్తున కొనుగోలు చేసిన మెర్సిడెస్ లేదా ఆడి కార్ల కంటే ఇవి చాలా నిరాడంబరంగా కనిపిస్తున్నాయన్నారు. భారతదేశం నుండి రష్యా చాలా నేర్చుకోవాలని నమ్ముతున్నట్లు ఆయన అన్నారు. భారతదేశం వారి దేశంలో ఉత్పత్తి చేయబడిన కార్లు, నౌకల ఉత్పత్తి, వాటి వినియోగంపై దృష్టి సారిస్తున్నారు. ఈ విషయంలో ప్రధాని మోదీ మేడ్ ఇన్ ఇండియాను వాడేలా ప్రజలను ప్రోత్సహిస్తూ సరైన పని చేస్తున్నారని అన్నారు.
రష్యా లాజిస్టిక్స్‌ను అభివృద్ధి చేసేందుకు IMEC సహాయం
రష్యాలో తయారైన ఆటోమొబైల్స్‌ను ఉపయోగించడం చాలా మంచిదని ఆయన అన్నారు. తమ వద్ద రష్యాలో తయారైన ఆటోమొబైల్స్ ఉన్నాయని, వాటిని తప్పనిసరిగా ఉపయోగించాలని అన్నారు. ఈ విషయంలో తమ WTO బాధ్యతలను ఉల్లంఘించదని తెలిపారు. ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్‌లో పుతిన్ మాట్లాడుతూ, కొత్త ఆర్థిక కారిడార్ ఏర్పాటుపై అమెరికా యూరోపియన్ యూనియన్, సౌదీ అరేబియా,భారత్ అంగీకరించాయని అన్నారు. ఈ ప్రాజెక్ట్ నుండి రష్యా ప్రయోజనం పొందుతుందన్న ఆయన, తమ దేశానికి లాజిస్టిక్స్‌ను అభివృద్ధి చేసేందుకు IMEC సహాయం చేస్తుందని.. కొన్నేళ్లుగా ఈ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉందని తెలిపారు.
భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ ఏర్పాటుకు ఎంఒయు
న్యూఢిల్లీలో జరిగిన జి-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారత్, అమెరికా, యుఎఇ, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్‌లు భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ ఏర్పాటుకు ఎంఒయుపై సంతకాలు చేసిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.