
Trump-Putin:'పుతిన్ పగలు అందంగా మాట్లాడతాడు,రాత్రి బాంబుతో విరుచుకుపడుతారు': పుతిన్‌పై ట్రంప్ ఫైర్
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా చేసిన ప్రతిపాదనను రష్యా ఖండించింది. ఈ పరిణామం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రవర్తనపై విమర్శలు గుప్పించిన ట్రంప్... మాస్కోపై కఠిన ఆంక్షలకు సిద్ధమవుతున్నట్టు సంకేతాలు ఇచ్చారు. అలాగే ఉక్రెయిన్‌కు ఆధునిక ఆయుధాలు సమకూర్చేందుకు కూడా అంగీకారాన్ని తెలిపారు. పుతిన్ ఉద్దేశాలు తనకు స్పష్టంగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించిన ట్రంప్, "పగలు ఆయన ఆయన చాలా అందంగా మాట్లాడుతారు. కానీ రాత్రయితే ప్రజలపై బాంబులతో విరుచుకుపడుతారు. . ఇలాంటి దుర్మార్గపు ప్రవర్తనను మనం సహించలేం" అని అన్నారు. మాస్కోపై ఆంక్షల విధానంపై అమెరికా యోచన చేస్తోందని ట్రంప్ తెలిపారు.
వివరాలు
రష్యాపై ఆంక్షలు.. ద్వైపాక్షిక బిల్లు సిద్ధం
"రష్యాపై కొత్తగా, కఠినమైన ఆంక్షలు విధించాలా అన్న విషయాన్ని మేము పరిశీలిస్తున్నాం. సోమవారం (అమెరికా సమయం ప్రకారం) దీనిపై స్పష్టత ఇవ్వగలము" అని చెప్పారు. ఈ క్రమంలో రష్యాపై ఆంక్షలు విధించేందుకు అమెరికా సెనేటర్లు ఇప్పటికే ఓ ద్వైపాక్షిక బిల్లును సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ బిల్లులో రష్యాకు మద్దతు ఇచ్చే దేశాలపై 500 శాతం టారిఫ్‌లు విధించేలా ప్రతిపాదనలు ఉన్నట్టు రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ వెల్లడించారు.
వివరాలు
ఉక్రెయిన్‌కు ఆయుధ సహాయం పెంపు
మరోవైపు, రష్యాతో సాగుతున్నయుద్ధంలో ఉక్రెయిన్‌కు మరింత ఆయుధ సహాయం అందించేందుకు ట్రంప్ అంగీకరించారు. ముఖ్యంగా అమెరికా అత్యాధునిక పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు పంపించనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఆ దేశానికి ఇటువంటి రక్షణ వ్యవస్థలు అత్యవసరమని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే, పంపించబోయే ఆయుధాల పరిమాణాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇంతకముందు ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరాను నిలిపివేస్తామని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.
వివరాలు
సహాయం కాదు, ఇది వ్యాపారం
కొద్ది రోజులకే తన నిర్ణయాన్ని మార్చుకున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌కు రక్షణ సంబంధిత ఆయుధ వ్యవస్థలు అత్యవసరమని భావిస్తున్నట్టు తెలియజేశారు. అయితే, ఈ ఆయుధాలను ఉచితంగా అందించేది లేదని, పూర్తిగా చెల్లింపుల మీద ఆధారపడి పంపిస్తామని స్పష్టం చేశారు. "ఇది మేం చేస్తున్న సహాయం కాదు, ఇది వ్యాపారం" అని తేల్చిచెప్పారు.