Page Loader
Trump pakistan deal : పాకిస్థాన్ క్రిప్టో కౌన్సిల్‌తో అమెరికా ఒప్పందం.. ట్రంప్ ఫ్యామిలీ,పాక్ ఆర్మీ చీఫ్‌కి లింకులు!
ట్రంప్ ఫ్యామిలీ,పాక్ ఆర్మీ చీఫ్‌కి లింకులు!

Trump pakistan deal : పాకిస్థాన్ క్రిప్టో కౌన్సిల్‌తో అమెరికా ఒప్పందం.. ట్రంప్ ఫ్యామిలీ,పాక్ ఆర్మీ చీఫ్‌కి లింకులు!

వ్రాసిన వారు Sirish Praharaju
May 16, 2025
04:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడికి ముందు పాకిస్థాన్,అమెరికాకు చెందిన ఒక ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ సంస్థ మధ్య కీలక ఒప్పందం కుదిరినట్టు సమాచారం. ఈ ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబం,పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ మధ్య సంబంధాలు ఉన్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈనేపథ్యంలో భారత్‌తో పాటు అమెరికా కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించినట్టు మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. పాకిస్తాన్‌లో ఇటీవల స్థాపించబడిన క్రిప్టో కౌన్సిల్,అమెరికాకు చెందిన ప్రైవేట్ సంస్థ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ మధ్య ఈ ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. ఈ ఒప్పందంలో పాక్‌కు చెందిన రాజకీయ,వ్యాపార రంగాల ప్రముఖులు కూడా పాలుపంచుకున్నట్టు సమాచారం. ట్రంప్ కుటుంబంతో సంబంధాలున్నసంస్థగా వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్‌కు గుర్తింపు ఉంది.

వివరాలు 

ట్రంప్ కుటుంబ ప్రమేయం 

గతంలో భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి తాను ప్రధాన కారణమని ట్రంప్ చెప్పుకున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందానికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళ్తే, వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ కంపెనీలో ట్రంప్ కుమారులు ఎరిక్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌తో పాటు ఆయన అల్లుడు జెరెడ్ కుష్నర్ కలిపి సుమారు 60 శాతం వాటా కలిగి ఉన్నారు. ఈ కంపెనీ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్‌తో లిఖితపూర్వక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

వివరాలు 

బైనాన్స్ వ్యవస్థాపకుడిని సలహాదారుగా నియామకం 

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, పాక్ క్రిప్టో కౌన్సిల్ ఏర్పడిన కొద్ది రోజులకే, తమ విశ్వసనీయతను పెంచాలన్న ఉద్దేశంతో ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్ అయిన బైనాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్‌పెంగ్ జావోను తమ సలహాదారుగా నియమించుకున్నారు. ఏప్రిల్ ప్రారంభంలో జరిగిన ప్రారంభ వేడుకలో ఈ కౌన్సిల్ ఇస్లామాబాద్‌ను "దక్షిణ ఆసియాలో క్రిప్టో రాజధాని"గా మారుస్తామని ప్రకటించింది.

వివరాలు 

పాక్ ఆర్మీ చీఫ్ స్వయంగా స్వాగతం 

ఈ ఒప్పందాన్ని మరింత బలపరిచే క్రమంలో అమెరికా నుండి ఉన్నతాధికారుల బృందం ఇస్లామాబాద్‌కి చేరుకుంది. ఈ బృందానికి నేతృత్వం వహించిన జెకరీ విట్‌కాఫ్ ట్రంప్‌కు వ్యాపార భాగస్వామిగా ఉన్న స్టీవ్ విట్‌కాఫ్ కుమారుడు. స్టీవ్ ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ కోసం అమెరికా ప్రభుత్వ ప్రత్యేక రాయబారిగా ఉన్నారు.ఈ బృందానికి స్వయంగా పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ స్వాగతం పలికారు. అనంతరం మునీర్, పాక్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్‌ల మధ్య ఒక గోప్య సమావేశం కూడా జరిగినట్టు సమాచారం. జనరల్ మునీర్ ఈ ఒప్పందంలో నేరుగా పాల్గొనడం వల్ల,ఇది పాకిస్తాన్ జాతీయ భద్రతా వ్యవస్థతో సంబంధం ఉందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఇప్పటివరకు ఆ విషయంపై స్పష్టత తేలలేదు.

వివరాలు 

ఒప్పందపు ముఖ్యాంశాలు 

పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్,వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం,ఈ ఒప్పందం ద్వారా బ్లాక్‌ఛైన్ టెక్నాలజీని పాక్ ఆర్థిక వ్యవస్థలో ప్రవేశపెట్టేందుకు అనుమతి లభించింది. ఇందులో ఆస్తుల టోకనైజేషన్, స్టేబుల్ కాయిన్ల అభివృద్ధి, డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ పై పైలట్ ప్రాజెక్టుల అమలుకు అవసరమైన రెగ్యులేటరీ సాండ్‌బాక్స్‌ల ఏర్పాటును చేర్చారు. ఈ ప్రయత్నం ప్రధానంగా "ఆర్థిక ప్రాప్యతను విస్తరించడం మరియు డిజిటల్ మార్పును వేగవంతం చేయడం" అనే లక్ష్యంతో చేపట్టినదిగా పేర్కొన్నారు.

వివరాలు 

ఆరోపణలు, విమర్శలు 

పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ ఆర్మీ ప్రమేయం ఉందన్న ఆరోపణలు వస్తున్నవేళ,ఈ క్రిప్టో ఒప్పందంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్పందించిన వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థ,తమ ఒప్పందానికి ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేస్తూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే ట్రంప్ కుటుంబం, వైట్‌హౌస్ ఇప్పటివరకు ఈ అంశంపై ఎటువంటి ప్రకటన చేయలేదు. మరోవైపు, భారతదేశానికి చెందిన వ్యూహాత్మక విశ్లేషకులు ఈ ఒప్పందాన్ని "రాజకీయ రంగు సంతరించుకున్నరహస్యమైన ఆర్థిక ఒప్పందం"గా అభివర్ణిస్తూ అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు.