Page Loader
Bangladesh: హసీనా కుటుంబంపై ప్రతీకార దాడులు..సైమా వాజెద్‌పై ఏసీసీ తీవ్ర ఆరోపణలు
హసీనా కుటుంబంపై ప్రతీకార దాడులు..సైమా వాజెద్‌పై ఏసీసీ తీవ్ర ఆరోపణలు

Bangladesh: హసీనా కుటుంబంపై ప్రతీకార దాడులు..సైమా వాజెద్‌పై ఏసీసీ తీవ్ర ఆరోపణలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 27, 2025
03:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుంటూ అక్కడి ప్రభుత్వం దాడులు కొనసాగిస్తోంది. మహమ్మద్‌ యూనస్‌ ప్రభుత్వం ఇప్పటికే పలు కేసుల్లో హసీనా కుటుంబ సభ్యుల పేర్లను చేర్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె కుమార్తె సైమా వాజెద్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పదవి నుంచి తొలగించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సైమా వాజెద్ డబ్ల్యూహెచ్‌వో ఆగ్నేయ ఆసియా ప్రాంతీయ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. వృత్తిరీత్యా సైకాలజిస్ట్‌గా నాడీ సంబంధ రుగ్మతలపై ఆమె ముఖ్యమైన పరిశోధనలు చేశారు.

Details

షేక్ హసీనాను అరెస్టు చేయడానికి తీవ్ర ప్రయత్నాలు

2024 జనవరిలో ఈ పదవిని చేపట్టిన ఆమెపై బంగ్లాదేశ్ యాంటీ కరెప్షన్ కమిషన్ (ఏసీసీ) పలు ఆరోపణలు చేస్తూ చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది. ఏసీసీ వైద్య, విదేశాంగ శాఖలకు లేఖలు పంపడానికి ఏర్పాట్లు చేసింది. ఇక షేక్‌ హసీనాను అరెస్టు చేయడానికి బంగ్లాదేశ్‌ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అంతర్జాతీయ క్రైమ్‌ ట్రైబ్యునల్‌ ద్వారా ఆమెపై అరెస్టు వారెంట్లు జారీ చేసింది. భారత్‌ నుంచి ఆమెను అప్పగించాల్సిందిగా పలు సార్లు లేఖలు రాశారు. మహమ్మద్‌ యూనస్‌ ప్రభుత్వ హయాంలో భారత్‌తో బంగ్లాదేశ్‌ సంబంధాలు దెబ్బతిన్నాయి.

Details

 అంతర్జాతీయ మద్దతును పొందేందుకు ప్రయత్నాలు

అంతేకాకుండా, పాకిస్థాన్‌తో బంగ్లాదేశ్‌ సంబంధాలు మెరుగవుతున్నాయన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. సైమా వాజెద్‌ డబ్ల్యూహెచ్‌వోలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ, ఆరోగ్య రంగంలో సైకాలజీ నిపుణురాలిగా ప్రఖ్యాతి పొందారు. కానీ బంగ్లాదేశ్‌ ప్రభుత్వం చేసిన ఆరోపణల వల్ల ఆమె స్థానం ప్రభావితమయ్యే ప్రమాదం ఉంది. హసీనా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడమే కాకుండా, మహమ్మద్‌ యూనస్‌ ప్రభుత్వం అంతర్జాతీయ మద్దతు కూడగట్టే ప్రయత్నాలు కూడా చేస్తోంది. ఇది భవిష్యత్ బంగ్లాదేశ్ రాజకీయ పరిణామాలపై ప్రభావం చూపనుంది.