Russia Nuclear Weapon in Space: రష్యా మాస్టర్ ప్లాన్...అంతరిక్షంలో అణ్వాయుధం... యూరప్‌లో కలకలం
ఈ వార్తాకథనం ఏంటి
జర్మనీకి చెందిన Süddeutsche Zeitung, NDR, WDR మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పాశ్చాత్య నిఘా సంస్థలు, జర్మనీ సైన్యం, ఫెడరల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ (BND) అంచనాల ప్రకారం.. 'స్పుత్నిక్-ఎస్'గా పేర్కొంటున్న ఉపగ్రహం మాస్కో సమీపంలో సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. నవంబర్ ప్రారంభంలో వచ్చిన హెచ్చరికల ప్రకారం, 60 రోజుల్లోగా ప్రయోగం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్‌కు కూడా సైనిక నిపుణులు ఈ అంశంపై వివరించినట్లు కథనాలు పేర్కొన్నాయి.
Details
జర్మనీ, నాటో ఆందోళన.. రష్యా ఖండన
ఈ వార్తలపై జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టే ఆందోళన వ్యక్తం చేశారు.
అంతరిక్షంలో అణ్వాయుధాల మోహరింపు వార్తలు కొత్తవి కాకపోయినా, వాటిని తేలికగా తీసుకోలేమని మెర్జ్ పేర్కొన్నారు.
అంతరిక్షంలోనూ తమ సభ్య దేశాల భద్రతకు నాటో ప్రాధాన్యం ఇస్తుందని రుట్టే స్పష్టం చేశారు.
అయితే రష్యా అధ్యక్ష కార్యాలయ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఈ వార్తలను తోసిపుచ్చారు.
బెర్లిన్‌లోని రష్యా రాయబార కార్యాలయం కూడా తమకు అలాంటి ప్రణాళికలపై సమాచారం లేదని, ఆరోపణలు నిరాధారమని తెలిపింది.
Details
అణు పేలుడు జరిగితే ఉపగ్రహ సేవలకు ముప్పు
అంతరిక్షంలో అణు పేలుడు జరిగితే దాని ప్రభావం ఒక్క దేశానికే పరిమితం కాదు.
భూమికి సమీప కక్ష్యలోని ఉపగ్రహాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఫలితంగా మొబైల్ కమ్యూనికేషన్లు, ఇంటర్నెట్, నావిగేషన్, వాతావరణ అంచనాలకు ఉపయోగించే సేవలు తీవ్రంగా ప్రభావితమవుతాయి.
నేటి ప్రపంచంలో రవాణా నుంచి రక్షణ రంగం వరకు అనేక వ్యవస్థలు ఉపగ్రహాలపై ఆధారపడుతున్నాయి.
అందుకే ఈ తరహా ఆయుధం మోహరింపు ప్రపంచ దేశాల భద్రతకు పెద్ద సవాలుగా మారవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Details
అంతర్జాతీయ ఒప్పందాలకు విరుద్ధమా?
1967లో కుదిరిన ఔటర్ స్పేస్ ట్రీటీ ప్రకారం, భూమి చుట్టూ కక్ష్యలో అణ్వాయుధాలు లేదా ఇతర సామూహిక విధ్వంసక ఆయుధాలను మోహరించడం నిషేధం.
1963 పాక్షిక అణు పరీక్షల నిషేధ ఒప్పందం కూడా అంతరిక్షంలో అణు పేలుళ్లను అనుమతించదు. రష్యా ఈ ఒప్పందాలపై సంతకం చేసింది.
మరోవైపు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తమ దేశానికి నాటో సభ్యత్వమే బలమైన భద్రతా హామీ అని మరోసారి స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో అంతరిక్షంలో అణ్వాయుధాల మోహరింపు అంశం అంతర్జాతీయ భద్రతా చర్చల్లో కీలకంగా మారింది.