
Russia exits INF Treaty: అమెరికా నిర్ణయం.. యూరప్‌కు ముప్పు.. అణుఒప్పందం నుంచి రష్యా ఔట్
ఈ వార్తాకథనం ఏంటి
రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న హఠాత్ నిర్ణయం ఇప్పుడు ఐరోపా దేశాలకు ప్రాణసంకటంగామారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యశ్రేణి క్షిపణుల మోహరింపును నియంత్రించేందుకు అమెరికా-రష్యాల మధ్య ఉనికిలో ఉన్న ఐఎన్‌ఎఫ్ ఒప్పందాన్ని ఇకపై అనుసరించబోమని రష్యా తేల్చిచెప్పింది. పశ్చిమ దేశాలు తమ జాతీయ భద్రతకు నేరుగా ముప్పు తేవడంతో ఈ ఒప్పందాన్ని కొనసాగించే పరిస్థితులు లేవని స్పష్టంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో, రష్యా విదేశాంగ శాఖ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే కొన్ని రకాల క్షిపణుల మోహరింపుపై స్వయంగా విధించుకున్న ఆంక్షలను ఇకపై పాటించబోమని తెలిపింది.
వివరాలు
రెండు ఒహైయో శ్రేణి అణు జలాంతర్గాములను మోహరించేలా ఆదేశాలు
అమెరికా తన సైన్యాన్ని ఫిలిప్పీన్స్‌లో మోహరించి, టైఫూన్ క్షిపణి లాంచర్లను పెట్టడమే కాక, ఆస్ట్రేలియా సమీపంలోని 'టలిస్మాన్ సాబ్రె' పేరిట జరిగే మిలిటరీ డ్రిల్స్‌లో కూడా క్షిపణుల పరీక్షలు జరపడం, ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని రష్యా పేర్కొంది. అంతేకాదు, ఇటీవల రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదెవ్ చేసిన ప్రకటన నేపథ్యంలో, ట్రంప్ రెండు ఒహైయో శ్రేణి అణు జలాంతర్గాములను మోహరించేందుకు ఆదేశాలు జారీ చేయడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది.
ఐఎన్‌ఎఫ్
ఐఎన్‌ఎఫ్ ఒప్పందం అంటే ఏమిటి?
1987లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్, సోవియట్ నేత మిఖాయిల్ గోర్బచెవ్ లు కలిసి ఐఎన్‌ఎఫ్ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీనిని 'ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ట్రీటీ'గా పిలుస్తారు. ఈ ఒప్పందం ప్రకారం, భూ ఉపరితలంపై నుంచి ప్రయోగించే మధ్యశ్రేణి (500 కి.మీ నుంచి 5,500 కి.మీ మధ్య) అణు క్షిపణుల మోహరింపును నిషేధించారు. అప్పట్లో ఈ ఒప్పందం వల్ల అమెరికా-సోవియట్ దేశాలు కలిపి దాదాపు 2,692 క్షిపణులను ధ్వంసం చేశాయని గణాంకాలు చెబుతున్నాయి. ప్రచ్ఛన్న యుద్ధాన్ని శాంతి దిశగా మలుపుతిప్పిన కీలక ఒప్పందంగా దీనిని పరిగణిస్తారు. కానీ, వాస్తవానికి ఈ రేంజ్‌లో ఉన్న క్షిపణుల కారణంగా ఎక్కువ ముప్పు అమెరికా మిత్ర దేశాలైన ఐరోపా దేశాలకే ఎదురవుతుంది.
వివరాలు
ఒప్పందం నుంచి అమెరికాను బయటకు లాగేశారు
2019లో, అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ ఐఎన్‌ఎఫ్ ఒప్పందం నుంచి అమెరికాను బయటకు లాగేశారు. రష్యా దీన్ని పలు మార్లు ఉల్లంఘించిందని ఆరోపించారు. ముఖ్యంగా, 9ఎం729 లేదా ఎస్‌ఎస్‌సీ-8 పేరిట ఓ మధ్యశ్రేణి క్షిపణిని మోహరించిందని పేర్కొన్నారు. అయితే ఆ ఆరోపణలను మాస్కో అప్పట్లో ఖండించింది. అయితే ఇప్పుడే ట్రంప్ అణు జలాంతర్గాముల మోహరింపు ఆదేశాలు ఇచ్చిన మూడురోజుల వ్యవధిలోనే, రష్యా కూడా ఈ ఒప్పందం నుంచి తాము పూర్తిగా బయటపడుతున్నామని అధికారికంగా ప్రకటించింది.