LOADING...
Russia: రష్యా సంచలన ప్రకటన.. చమురు కొనుగోలుపై భారత్‌కు రష్యా 5 శాతం రాయితీ

Russia: రష్యా సంచలన ప్రకటన.. చమురు కొనుగోలుపై భారత్‌కు రష్యా 5 శాతం రాయితీ

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 20, 2025
02:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై అదనపు సుంకాలు విధించిన తీరు పట్ల రష్యా తీవ్రంగా స్పందించింది. భారత్‌ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతోనే ఈ చర్యలు తీసుకోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని,అలాంటి నిర్ణయం దుర్మార్గపు చర్యేనని మాస్కో విమర్శించింది. ఈ మేరకు ఢిల్లీలోని రష్యా రాయబారి కార్యాలయం బుధవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. అదే సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ సంవత్సరం చివరిలో భారత్ పర్యటనకు రానున్నారని, ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారని తెలిపింది. ఈ పర్యటనకు సంబంధించి ఖచ్చితమైన తేదీలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని, అధికారిక షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని రాయబార కార్యాలయం వివరించింది.

వివరాలు 

చమురు కొనుగోలుపై భారత్‌కు రష్యా 5 శాతం రాయితీ 

మరోవైపు, భారత్‌పై సుంకాల విధింపు వెనుక ఉద్దేశ్యం రష్యాపై ఒత్తిడి తేవడమేనని అమెరికా బహిరంగంగా అంగీకరించింది. భారత్‌తో ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలన్న రష్యా లక్ష్యానికి అనుగుణంగానే ఈ ప్రకటన వెలువడిందని అధికారులు పేర్కొన్నారు. ''మేము భారత్‌కు ముడి చమురు కొనుగోలులో 5 శాతం డిస్కౌంట్ ఇస్తున్నాం. సరఫరా మార్పు జరగదని భారత్ అర్థం చేసుకుంది. దీని వల్ల భారత్ చాలా లాభాలు పొందుతోంది. రష్యా చమురుకు నిజమైన ప్రత్యామ్నాయం లేదు, ఎందుకంటే అది అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత పోటీతత్వాన్ని కలిగి ఉంది. అంతేకాదు, భారత్ మా కోసం అత్యంత కీలకమైన మిత్రదేశం'' అని రష్యా స్పష్టం చేసింది.

వివరాలు 

రష్యా చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది 

వాణిజ్య సంబంధాల విస్తరణలో భాగంగా భారత్ పాడి, వ్యవసాయ రంగాలను తెరవడంపై దృష్టి సారిస్తుండగా, అమెరికాతో సంబంధాలు సంక్లిష్టతరమవుతున్న సమయంలో రష్యా చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్‌తో వాణిజ్య లావాదేవీలు మరింత సులభతరం చేయడానికి మెరుగైన చెల్లింపు పద్ధతుల రూపకల్పనపై తాము కట్టుబడి ఉన్నామని రష్యా రాయబారి కార్యాలయం పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు ఉన్నప్పటికీ, ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యం బలపడేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో ఈ చర్యలు కీలకం వెల్లడించింది.

వివరాలు 

అమెరికా సుంకాల పెంపు ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం

అంతర్జాతీయ వాణిజ్య విధానాలపై అమెరికా వైఖరిని ధిక్కరిస్తూ రష్యా రాయబార కార్యాలయం స్పందించింది. ''అమెరికా సుంకాల పెంపు ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం. అవి జాతీయ ప్రయోజనాలను పూర్తిగా పక్కన పెట్టాయి'' అని విమర్శించింది. భారత్‌తో ఆర్థిక సంబంధాలపరంగా రెండు దేశాల మధ్య వాణిజ్యానికి ఆటంకం కలిగించే అడ్డంకులను తొలగించడమే రష్యా సంకల్పమని రాయబార కార్యాలయం అధికారులు స్పష్టం చేశారు. ఇందుకోసం వాణిజ్య ప్రక్రియలను సరళతరం చేయడం, వ్యాపార లావాదేవీల కోసం మరింత సమర్థవంతమైన వ్యవస్థలను ఏర్పరచడమే తమ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు.