భారత్ అమెరికా భేటీలో కీలక చర్చలు..కెనడాతో పాటు అంతర్జాతీయ అభివృద్ధిపైనా మంతనాలు
అగ్రరాజ్యం అమెరికాలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, యూఎస్ విదేశాంగ శాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్‌తో గురువారం భేటీ అయ్యారు. స్నేహితులు బ్లింకెన్ ను కలిసినందుకు చాలా గొప్పగా ఉందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. పలు అంతర్జాతీయ అంశాలపైనా చర్చించామన్నారు.ప్రధాని మోదీ జూన్ లో అమెరికా పర్యటనకు కొనసాగింపుగా చర్చలు చేసినట్లు తెలిపారు. ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు చేశారని,నిజ్జర్ హత్యలో భారత్, కెనడా దౌత్యపరమైన వివాదంపై సమాలోచనలు జరిపినట్లు సమాచారం. మరోవైపు అగ్ర దౌత్యవేత్తలు భారత్ G-20 ప్రెసిడెన్సీ కీలక ఫలితాలు, మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనామిక్ కారిడార్, పారదర్శక, స్థిరమైన, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులను సృష్టించే అంశాలపైనా చర్చించినట్లు అమెరికా అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ పేర్కొన్నారు
త్వరలోనే భారత్ వేదికగా 2+2 సమావేశం జరగనుంది
ముఖ్యంగా రక్షణ, అంతరిక్షం, క్లీన్ ఎనర్జీ రంగాల్లో పరస్పర సహకార ప్రాముఖ్యతపైనా అమెరికా కార్యదర్శి, విదేశాంగ మంత్రి బ్లింకెన్ నొక్కి చెప్పారని మాథ్యూ మిల్లర్ వెల్లడించారు. భారత్-అమెరికా 2+2 మంత్రుల సంభాషణ ఐదో ఎడిషన్‌కు దిల్లీ ఆతిథ్యం ఇవ్వనుందని అంతకుముందు జై శంకర్ ప్రకటించారు. అయితే సమావేశ తేదీలను మాత్రం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలోనే నవంబర్ నెలలో దీనిపై కేంద్ర మంత్రివర్గ చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. అమెరికా ప్రతినిధి బృందానికి ఆ దేశపు రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్‌తో పాటు బ్లింకెన్ ప్రాతినిధ్యం వహించనున్నారు. మరోవైపు భారతదేశం తరఫున జై శంకర్, సహా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారత బృందానికి నాయకత్వం వహిస్తారు.