సముద్రంలో పయనిస్తున్న నౌకలో భారీ అగ్ని ప్రమాదం.. 3000 కార్లు అగ్గిపాలు, వ్యక్తి మృతి
యూరప్ ఖండంలోని నెదర్లాండ్స్‌కు చెందిన ఓ సరకు రవాణా నౌకలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు 3వేల కార్లతో ఉత్తర సముద్రం (అట్లాంటిక్ సముద్రంలోని ఓ భాగం)లో వెళ్తున్న ఈ భారీ నౌకలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఆకస్మికంగా ప్రమాద తీవ్రత పెరగగా సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో తప్పించుకునేందుకు ప్రయత్నించి కొందరు సముద్రంలోకి దూకేసినట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. ఈ నేపథ్యంలో సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ దుర్ఘటనలో ఒక వ్యక్తి మరణించినట్లు అధికారులు నిర్థారించారు. నౌక పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు స్పష్టం చేశారు. నౌకలో భారీ మంటలు ఎగసిపడటంతో కార్లన్నీ పూర్తిగా కాలిబూడిదయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
నౌకలో మొత్తం 23 మంది సిబ్బంది ఉన్నారు
జర్మనీ దేశంలోని బ్రెమెన్ పోర్టు నుంచి 2857 కార్లతో ఫ్రెమాంటిల్ హైవే నౌక బయలుదేరింది.ఈ కార్లన్నీ ఈజిప్టులోని మరో పోర్టుకు తరలిస్తున్నారు.అయితే ఇందులో పలు ఎలక్ట్రిక్ వాహనాలు సైతం ఉన్నట్లు అధికారులు తేల్చారు. అమేలాండ్ ద్వీపానికి 27 కిమీ సమీపంలోకి రాగానే నౌకలో ఆకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చే అవకాశం లేకపోవడంతో సిబ్బంది సముద్రంలోకి దూకినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో డచ్ కోస్ట్ గార్డ్ హెలికాప్టర్లు, బోట్ల సాయంతో రంగంలోకి దిగింది.నౌకలో మొత్తం 23 మంది సిబ్బంది ఉన్నారు. విశేషంగా కృషి చేసిన రెస్క్యూ సిబ్బంది, వారిని బయటకు తీసుకువచ్చారు. మంటలు అదుపులోకి వచ్చే అవకాశం లేదు. ఈ మేరకు భారీ నౌక నీటిలో మునిగిపోకుండా ఉండేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.