Irelannd: ఐర్లాండ్ కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికైన సైమన్ హారిస్.. అతి పిన్న వయస్కుడైన ప్రధానిగా ప్రమాణ స్వీకారం
ఐర్లాండ్ పార్లమెంట్‌లో మంగళవారం జరిగిన ఓటింగ్‌లో ఎంపీ సైమన్ హారిస్ ఐర్లాండ్ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఫైన్ గేల్ పార్టీకి కొత్త నాయకుడిగా ఎన్నికైన తర్వాత హారిస్ ఇప్పుడు దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా అవతరించారు. దీనికి ముందు,భారత సంతతికి చెందిన లియో వరద్కర్ ఐర్లాండ్ అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రి. అయితే గత నెలలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.మంగళవారం ఐర్లాండ్ పార్లమెంట్‌లో హారిస్‌కు మద్దతుగా 88 ఓట్లు పోలయ్యాయి. అయన సంకీర్ణ భాగస్వామ్య పార్టీలు ఫియానా ఫెయిల్, గ్రీన్ పార్టీతో పాటు అనేక మంది స్వతంత్ర ఎంపీల నుండి మద్దతు పొందారు.
24 ఏళ్లకే ఎంపీ అయ్యిన హారిస్
ఐరిష్ మాజీ ప్రధాని లియో వరద్కర్ ప్రభుత్వంలో హారిస్ ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ప్రధానిగా ఎన్నికైన తర్వాత, తనను ఎన్నుకున్న వారికి హారిస్ కృతజ్ఞతలు తెలియజేశారు. మీ నమ్మకాన్ని తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చారు. హారిస్ పొలిటికల్ కెరీర్ చూస్తే.. 16 ఏళ్ల వయసులో ఫైన్ గేల్ పార్టీలో చేరి అతి త్వరలోనే విజయాల బాట పట్టిన సంగతి తెలిసిందే. అయన కేవలం 22సంవత్సరాల వయస్సులో కౌంటీ కౌన్సిలర్ అయ్యాడు. 24ఏళ్ల వయసులో 2011లో ఎంపీగా ఎన్నికయ్యారు.ఆసమయంలో దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఎంపీగా కూడా పాపులర్ అయ్యాడు. 2016లో కేబినెట్‌లో ఆరోగ్య మంత్రిగా నియమితులయ్యారు.అప్పటికి అయన వయసు 29 సంవత్సరాలు. ఆతర్వాత 2020లో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
లియో వరద్కర్ ఎందుకు రాజీనామా చేశారు?
ఐర్లాండ్ ప్రధాన మంత్రిగా, హారిస్ సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. శరణార్థుల సంక్షోభం, పెరుగుతున్న నిరాశ్రయుల సంఖ్యను ఎదుర్కోవడం వారికి సవాలుగా ఉంటుంది. కానీ అయనకి అత్యంత ముఖ్యమైన పని తన మంత్రివర్గాన్ని ఎన్నుకోవడం. వచ్చే ఏడాది ఐర్లాండ్‌లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ విధంగా కొత్త ప్రధానికి దాదాపు ఏడాది పదవీకాలం ఉంటుంది. ఐర్లాండ్ భారతీయ సంతతికి చెందిన ప్రధాన మంత్రి లియో వరద్కర్ ఇటీవల తన వ్యక్తిగత, రాజకీయ కారణాలను చూపుతూ తన పదవికి మరియు పార్టీ నాయకత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన ప్రకటనతో యావత్ దేశం ఉలిక్కిపడింది. నేను పార్టీ అధ్యక్ష పదవికి, నాయకత్వానికి సమర్థవంతంగా రాజీనామా చేస్తున్నాను అని వరద్కర్ చెప్పారు.