NATO: ఆహారం, ఔషధాలు నిల్వ చేయండి.. యుద్ధ భయాల నడుమ నాటో దేశాలు హెచ్చరిక
రష్యాపై ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి ఆయుధాలతో దాడి చేయడానికి అమెరికా నుంచి అనుమతి రావడం, నాటో కూటమిలో వివిధ దేశాల్లో ఉద్రిక్తతలు కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో నాటోలో కొత్తగా చేరిన స్వీడన్, ఫిన్లాండ్ తమ ప్రజలను ముందుగా అప్రమత్తం చేసే చర్యలకు పూనుకున్నాయి. యుద్ధ సమయాల్లో ఎలా స్పందించాలో వివరిస్తూ లక్షల కొద్దీ బుక్‌లెట్లను పంపిణీ చేస్తున్నాయి. ఈ కరపత్రాల్లో మంచి నీరు, స్టేషనరీ, ఆహార పదార్థాల నిల్వపై వివరాలు అందించడంతో పాటు విద్యుత్తు నిలిచిపోవడం, కమ్యూనికేషన్లలో అంతరాయం వంటి సమస్యలకు ప్రజలు ఎలా ఎదుర్కోవాలో సూచనలు ఉన్నాయి.
ఆహారాన్ని నిల్వ చేసుకోవాలి
చిన్నారుల కోసం డైపర్స్, ఔషధాలు, ప్రత్యేక ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని ప్రత్యేకంగా సూచనలు చేశారు. స్వీడన్ ప్రభుత్వం 'ఒకవేళ యుద్ధం వస్తే' అనే పేరుతో 50 లక్షల కరపత్రాలను వచ్చే రెండు వారాల్లో పంపిణీ చేయనుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇలాంటి సూచనల పుస్తకాలను ముద్రించడం ఇది ఐదోసారి. ఇప్పటికే ఈ గైడ్‌ను 55,000 మంది నెట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవడం విశేషం. ప్రపంచ పరిస్థితులు త్వరితగతిన మారుతున్నాయని, యుద్ధం మన సరిహద్దుల దగ్గరే ఉందన్నారు. టెర్రర్ అటాక్స్, సైబర్ ముప్పులు, తప్పుడు సమాచారంతోపాటు భవిష్యత్తులో మరిన్ని సవాళ్లు ఎదురుకానున్నాయని స్వీడన్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
అత్యవసర వస్తువులు కొనుగోలు చేసిన ప్రజలు
ఫిన్లాండ్ కూడా తన ప్రజలకు అప్రమత్తత పుస్తకాలను పంపిణీ చేసింది. ఈ దేశంలో 58% ప్రజలు ఇప్పటికే అత్యవసర వస్తువులను కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడం విశేషం. నార్వే కూడా ఈ విషయంలో ముందడుగు వేసి, 22 లక్షల కరపత్రాలను ముద్రించి పంపిణీ చేసింది. యుద్ధ భయాల నడుమ ప్రజలు ఈ చర్యలను స్వాగతిస్తున్నా, దీర్ఘకాలిక భద్రతా వ్యూహాలు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.