Trump Assassination Bid:ట్రంప్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు అరెస్టు.. బయటికొచ్చిన దృశ్యాలు
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం జరగడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో 58 ఏళ్ల ర్యాన్ వెస్లీ రౌత్ అనే నిందితుడిని సీక్రెట్ సర్వీస్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌కు సంబంధించిన ఫుటేజ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. అది పోలీసుల బాడీ కెమెరాల్లో రికార్డయ్యింది. మార్టిన్ కౌంటీ షరీఫ్ ఆఫీసు ఫేస్‌బుక్ పేజీలో ఈ వీడియోను రిలీజ్ చేశారు. వీడియోలో నిందితుడు లేత గులాబీ రంగు టీ-షర్ట్, సన్‌గ్లాసెస్ ధరించి, వాహనంలోకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా సీక్రెట్ సర్వీస్ అధికారులు అతడిని అరెస్ట్ చేస్తున్నట్లు కనిపించింది.
ఎలాన్ మస్క్ వ్యాఖ్యలను ఖండించిన వైట్ హౌస్
ఇక, ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కూడా ఈ ఘటనలో వార్తల్లో నిలిచారు. బైడెన్ లేదా కమలాహారిస్‌పై హత్యాయత్నాలు ఎందుకు జరగడం లేదంటూ మస్క్ చేసిన ట్వీట్ పెద్ద దుమారాన్ని రేపింది. దీనిపై విమర్శలు రావడంతో వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించారు. ఈ వ్యాఖ్యలపై సీక్రెట్ సర్వీస్ స్పందిస్తూ, మస్క్ పోస్టు గురించి తమకు సమాచారం ఉందని తెలిపింది. వైట్ హౌస్ కూడా దీనిపై స్పందించింది. హింసను ప్రోత్సహించటం బాధ్యతారాహిత్యం. అమెరికా రాజకీయాల్లో హింసకు స్థానం లేదని మస్క్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.