US tariff policy: ట్రంప్ సుంకాల విధానం అద్భుతం.. త్వరలో మరిన్ని: అమెరికా వాణిజ్య ప్రతినిధి
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేసిన టారిఫ్‌ల విధానం ఆశించిన ఫలితాలను ఇచ్చిందని అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమీసన్ గ్రీర్ తెలిపారు. గత ఏడు దశాబ్దాలుగా కొనసాగుతున్నఅమెరికా వాణిజ్య విధానంలో ట్రంప్ కీలక మార్పులు తీసుకొచ్చారని ఆయన ప్రశంసించారు. ఈ చర్యల ప్రభావంతో అమెరికా వాణిజ్య లోటు గణనీయంగా తగ్గిందని వెల్లడించారు. త్వరలో ప్రపంచంలోని పలు దేశాలపై మరిన్ని టారిఫ్‌లను అమలు చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. వెట్టిచాకిరీ నిర్మూలనలో విఫలమైన దేశాలపై అమెరికా విధించిన కొన్ని సుంకాలను సుప్రీంకోర్టు రద్దు చేసిందని గ్రీర్ గుర్తుచేశారు. అయితే ఆ టారిఫ్‌లను మళ్లీ అమల్లోకి తీసుకురావడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందని తెలిపారు. ఇందుకోసం న్యాయపరమైన ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు.
వివరాలు
వాణిజ్య చర్చలు విజయవంతం కావడంలో సుంకాలు కీలక పాత్ర
ప్రపంచ దేశాలపై విస్తృత స్థాయిలో టారిఫ్‌లు అమలు చేయడం వల్ల అమెరికా అనేక కీలక భాగస్వామ్య దేశాలతో కొత్త వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోగలిగిందని ఆయన పేర్కొన్నారు.
యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే), యూరోపియన్ యూనియన్, ఇండోనేషియా, భారత్, జపాన్ వంటి దేశాలతో వాణిజ్య చర్చలు విజయవంతం కావడంలో ఈ సుంకాలు కీలక పాత్ర పోషించాయని వివరించారు.
ఈ టారిఫ్‌లను విదేశాంగ విధానంలో భాగంగా కాకుండా పూర్తిగా ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించామని గ్రీర్ స్పష్టం చేశారు.
అయితే ప్రభుత్వం అమలు చేసిన కొన్ని సుంకాలను సుప్రీంకోర్టు కొట్టివేయడం సరైన నిర్ణయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
వివరాలు
వాణిజ్య విధానాలను మార్చేందుకు ట్రంప్ యంత్రాంగం కట్టుబడి ఉంది: గ్రీర్
దీంతో అమెరికా వాణిజ్య అజెండాను కొనసాగించేందుకు అందుబాటులో ఉన్న న్యాయపరమైన అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు.
అమెరికాలో దశాబ్దాలుగా అమల్లో ఉన్న వాణిజ్య విధానాలను పూర్తిగా మార్చేందుకు ట్రంప్ యంత్రాంగం కట్టుబడి ఉందని గ్రీర్ తెలిపారు.
అమెరికా ఆర్థిక ప్రయోజనాలకు విరుద్ధంగా ఏ దేశం నిర్ణయాలు తీసుకున్నా, వాటిపై తగిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వెనుకాడదని స్పష్టం చేశారు.