US: ఉక్రెయిన్‌లో అమెరికా రాయబార కార్యాలయం తాత్కాలిక మూసివేత
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. రష్యా నవంబర్ 20న కీవ్‌పై భారీ వైమానిక దాడికి సిద్ధమవుతోందన్న సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. రాయబార కార్యాలయ సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి తగిన చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. ఉక్రెయిన్‌కు అమెరికా దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి అనుమతి ఇవ్వడంతో రష్యా ఆగ్రహానికి గురైంది. ఈ పరిణామాలపై స్పందించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణ్వాయుధ వినియోగానికి సంబంధించిన నిబంధనలను మరింత సులభతరం చేస్తూ కీలక నిర్ణయాలను తీసుకున్నారు.
సంయుక్త దాడిగానే పరిగణిస్తాం : రష్యా
అణ్వాయుధాలు కలిగిన దేశం సాయంతో తమపై దాడి జరిగితే, దాన్ని సంయుక్త దాడిగానే పరిగణిస్తామని రష్యా ప్రకటించింది. అమెరికా మద్దతుతో ఉక్రెయిన్ రష్యాపై ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిలో ఆరు క్షిపణులు ప్రయోగించగా, ఐదింటిని రష్యా నిర్వీర్యం చేయగా, ఒకటి ధ్వంసమైనట్లు ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో యూరప్ అంతటా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. రష్యా-ఉక్రెయిన్ వివాదం మరింత తీవ్రరూపం దాల్చడంతో నాటో దేశాలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. తాగునీరు, పిల్లల ఆహారం, ఔషధాలు వంటి అత్యవసర వస్తువులను నిల్వ చేసుకోవాలని తమ పౌరులకు సూచించాయి.
పెద్ద సమస్యగా మారే అవకాశం
చిన్నదైన వివాదం పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కీవ్‌లోని అమెరికా పౌరులకు ఎయిర్ అలర్ట్‌లు ప్రకటించగానే షెల్టర్లలోకి వెళ్లాలని అమెరికా ప్రభుత్వం ఆదేశించింది. ఈ చర్యలను కేవలం భద్రతా చర్యలుగా చూడాలని పేర్కొంది. ఈ పరిణామాలు యుద్ధాన్ని కొత్త మలుపులోకి నడిపే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.